పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు, భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మరోవైపు విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కాకినాడ , తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. బుధవారం ఈ జిల్లాలలో వానలుమరోవైపు బుధవారం రోజున రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకూ విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలలో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ,ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో బుధవారం ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందని అంచనా వేసింది.