ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యవహారం చుట్టూ గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు, హైదరాబాద్ శివారులో కోడి చెరువు కబ్జా ఆరోపణలు, తెలంగాణలో జనసేన పార్టీ సభ వంటి అంశాలు.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, హైకోర్టులో అనుకూలమైన తీర్పు రాకపోవడంతో.. సభను రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తనను విమర్శించే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇవ్వగా.. బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాత్రం మద్దతుగా నిలిచారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పాలని రఘునందన్ రావు సూటి ప్రశ్న వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ.. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి.. కొన్ని వందలసార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి.. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టడం లేదా అని ప్రశ్నించారు. అలా అయితే.. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఇక్కడ తెలంగాణలో ప్రెస్‌మీట్‌లు పెట్టొదా అని రఘునందన్ రావు.. రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బీఆర్ఎస్ సభలు పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ సభ పెట్టినంత మాత్రాన.. ఎవరి ఉనికి ఎవరికీ ప్రమాదం కాదని హితవు పలికారు. చివరికి ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే అధికారంలోకి వస్తారని ఎంపీ రఘునందర్ రావు తేల్చి చెప్పారు.