'ఆదాయం రూ.6.30 లక్షలే.. కానీ రూ.14 లక్షలకు ట్యాక్స్ నోటీసు'.. క్రెడిట్ కార్డ్ బిల్లుతో ఎంత పనైంది?

Wait 5 sec.

: పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలని, భారీగా సంపాదించే వారిపైనే ఐటీ శాఖ నిఘా పెడుతుందని భావిస్తుంటారు. కానీ, అది తప్పు. మనం సంపాదించే ఆదాయానికి, చేసే ఖర్చుకు పొంతన లేకపోయినా ఆదాయపు పన్ను శాఖ కన్ను పడుతుంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. ఏడాదికి కేవలం రూ.6.30 లక్షల ఆదాయం ఉందని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసిన సదరు వ్యక్తికి వచ్చాయి. అందుకు ఓ ప్రదాన కారణం ఉంది. అతను ఏకంగా రూ.27.65 లక్షల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాడు. దీంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. నగదు రూపంలో చెల్లించిన మొత్తాన్ని లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణనించి నోటీసులు జారీ చేసింది. దీంతో సదరు వ్యక్తి ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.ఏం జరిగిందంటే?ముంబైకి చెందిన శ్రేణిక్ మనీష్ మెహతా అనే ట్యాక్స్ పేయర్ అసెస్మెంట్ ఇయర్ 2023-24కు గానూ తన వార్షిక ఆదాయం రూ.6,30,820గా చూపిస్తూ ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశాడు. అయితే, ఐటీఆర్ తనిఖీ సమయంలో ఆయన క్రెడిట్ కార్డు ద్వారా రూ.27.65 లక్షలు చెల్లించినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో రూ.13,95,020 వరకు నగదు రూపంలోనే చెల్లించడంతో ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఐటీ శాఖ ప్రశ్నించింది. అందుకు సంబంధించి లెక్కలు చూపించాలని, లేదంటే ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు పంపించింది. చివరకు ఇలా క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఉపయోగించిన నగదుకు వివరణ ఇస్తూ ఆ డబ్బు తన కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన నగదు బహుమతులుగా పేర్కొన్నాడు. తన తండ్రి నుంచి రూ.8 లక్షలు, తల్లి నుంచి రూ.4.5 లక్షలు, భార్య నుంచి రూ.3 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం రూ.15.5 లక్షలు నగదు బహుమతిగా ఇచ్చారని చెబుతూ అఫిడవిట్లు సమర్పించారు. తన తండ్రి అగర్ బత్తి వ్యాపారం, తల్లి ట్యూషన్లు, హోమ్ మేడ ఫుడ్ బిజినెస్, భార్య కన్సల్టెన్సీ ద్వారా సంపాదిస్తున్నారని తెలిపారు. అయితే, కేవలం అఫిడవిట్లు సమర్పిస్తే సరిపోదని, సదరు కుటుంబ సభ్యులకు అంత మొత్తంలో నగదు బహుమతులు ఇచ్చే సామర్థ్యం ఉందో లేదో నిరూపించే ఆధారాలు లేవని ఐటీ శాఖ తోసిపుచ్చింది. రూ.13.95 లక్షల నగదును ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 69ఏ కింద లెక్క చూపని ఆదాయంగా పరిగణించి పన్ను పరిధిలోకి చేర్చారు. మొదటి అప్పిలేట్ అథారిటీ సైతం ఐటీ శాఖ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ముంబై ఐటీఏటీ ట్రిబ్యునల్ వద్దకు కేసు చేరింది. ట్యాక్స్ పేయర్ తన కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, లాభ నష్టాల అకౌంట్లను అదనపు ఆధారాలుగా సమర్పించాడు. వాటిని క్షుణ్నంగా పరిశీలించిన ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. భార్య ఇచ్చిన రూ.3 లక్షల గిఫ్టును పూర్తిగా మినహాయించింది. కానీ, తల్లి నుంచి వచ్చిన రూ.4.5 లక్షల నుంచి రూ.2.25 లక్షలు మాత్రమే మినహాయింపులోకి తీసుకుంది. తండ్రి ఇచ్చిన రూ.8 లక్షల నుంచి రూ.4 లక్షలకు మాత్రమే ఆమోదం తెలిపింది. దీంతో ఐటీ శాఖ చెప్పినట్లు రూ.13.95 లక్షల నుంచి రూ.9.25 లక్షలు పన్ను మినహాయింపు కల్పించింది. అయితే రూ.4.70 లక్షలకు మాత్రం పన్ను కట్టాలని సూచించింది.ట్యాక్స్ పేయర్లు నేర్చుకోవాల్సిన పాఠాలుక్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా బ్యాంక్ డిపాజిట్లలో పెద్ద మొత్తంలో నగదు వాడితే ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. దీంతో నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇంట్లోని పొదుపు డబ్బు నుంచి నగదు తీసుకున్నప్పుడు కేవలం బంధుత్వం ఉందనో లేక అఫిడవిట్ రాసిచ్చారోనో ఐటీ శాఖ ఒప్పుకోదు. గిఫ్ట్ రూపంలో డబ్బు తీసుకున్నప్పుడు ఐటీ శాఖ కు ఇచ్చిన వ్యక్తి పాన్, ఆధార్, ఆర్థిక సామర్థ్యం, లావాదేవీల వివరాలు చెప్పాల్సి వస్తుంది.