తిరుమలలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం, 6 నెలలకు ఒకసారి

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలోటీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తు్న్నారని.. వారికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యతన్నారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఇప్పటికే తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినప్పటికీ, వాటిని నిరంతరం కొనసాగించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యమైన ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. అదే రీతిలో తిరుమల లోని వివిధ హోటల్స్ కూడా ఉన్నత ఆహార ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం సుమారు 325 దుకాణాల్లో (Street Vendors) ఆహార విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటిలో దాదాపు 1,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థల యజమానులు తమ సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.నెస్లే ఇండియా సంస్థ ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి గ్లోవ్స్, ఆప్రాన్, సబ్బులు, టోపీలు తదితర వస్తువులు ఉండే కిట్లను ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార విక్రయ కేంద్రాల్లో మరింత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ శిక్షణలో ఆహార భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధ నిబంధనలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం, భక్తులకు సురక్షితమైన ఆహారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ మరియు సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఎస్వీ మ్యూజియంకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత సమయం లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.