హైదరాబాద్ మహానగరం చిక్కుకుంది. నగరవ్యాప్తంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. శనివారం ఒక్కరోజే నగరంలో ఏకంగా 15,200 ట్యాంకర్ల బుకింగ్స్ నమోదయ్యాయి. ఇది నగర చరిత్రలోనే ఒక రోజులో నమోదైన అత్యధిక డిమాండ్ కావడం గమనార్హం. 2025 వేసవిలో నమోదైన అత్యధిక రికార్డు 12 వేల బుకింగ్స్‌ను ఇది అధిగమించింది. గత నాలుగైదు రోజులుగా ప్రతిరోజూ సగటున 15 వేల బుకింగ్స్ వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం నగరంలో ప్రతి 90 కుటుంబాలకు ఒక వాటర్ ట్యాంకర్ అవసరమయ్యే పరిస్థితి నెలకొంది. మే నెల మొత్తంలో ఎలాంటి వేసవి జల్లులు కురవకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) గణాంకాల ప్రకారం.. కేవలం మే నెలలోనే నగరవాసులు 3.1 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్లను వినియోగించారు. ఈ అసాధారణ డిమాండ్‌ను తట్టుకోవడానికి జలమండలి తన మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించింది. నీటి ఫిల్లింగ్ స్టేషన్లను 86 నుంచి 96కి.. ఫిల్లింగ్ పాయింట్లను 141 నుండి 167కి పెంచింది. అలాగే రోడ్లపై తిరిగే ట్యాంకర్ల సంఖ్యను కూడా 1,135 నుంచి 1,250కి పెంచింది. అయినప్పటికీ.. నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడం, డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో నీటి బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.ఈ భారీ డిమాండ్ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో ట్యాంకర్ల సరఫరా ఆలస్యమవుతోంది. విలాసవంతమైన ప్రాంతంగా పేరున్న బంజారాహిల్స్ వంటి చోట్ల ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత ట్యాంకర్ రావటానికి ప్రజలు ఐదు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ట్యాంకర్ బుకింగ్స్‌లో 50 శాతానికి పైగా కేవలం గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల నుంచే వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.మరోవైపు జలమండలి అధికారులు ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము బుక్ చేసిన 95 శాతం ట్యాంకర్లను 24 గంటల లోపే డెలివరీ చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ట్యాంకర్లు నింపుకుని లొకేషన్‌కు వెళ్లిన తర్వాత వినియోగదారులు ఫోన్ కాల్స్ ఎత్తకపోవడం, మరికొందరు సాధారణ మున్సిపల్ నీటి సరఫరా రాగానే ట్యాంకర్ బుకింగ్స్‌ను రద్దు చేసుకోవడం వల్ల కూడా సరఫరా వ్యవస్థలో కొంత గందరగోళం, ఆలస్యం జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 10 తర్వాతే రాష్ట్రంలో నైరుతి రుతుపవన వర్షాలు ఉన్నాయని.. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే నగరానికి ఈ నీటి కష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉందని చెప్పారు.