గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసత్వంపై కీలక ప్రకటన వచ్చేసింది. కొడాలి నాని రాజకీయ వారసుడు ఎవరో మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. గుడివాడ లింగవరంలోని కె కన్వెన్షన్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై వైఎస్సార్‌సీపీ నేతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో పాటుగా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని రాజకీయ వారసుడు అంటూ ప్రకటించారు. 2034 ఎన్నికల్లో పోటీచేస్తారని పేర్ని నాని తెలిపారు. కొడాలి అర్జున్ నాని సోదరుడి కుమారుడు.. కొంతకాలంగా గుడివాడ వైఎస్సార్‌సీపీలో యాక్టివ్ అయ్యారు. గుడివాడలో సర్‌పై నిర్వహించిన సదస్సుకు అర్జున్ వచ్చారు.. వేదికపై మాజీ మంత్రులు, పార్టీ నేతల మధ్య కూర్చున్నారు. అర్జున్ 2034 ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రకటించడంతో.. 2029 ఎన్నికల్లో కొడాలి నాని ఎన్నికల బరిలో ఉంటారనే క్లారిటీ వచ్చింది. కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. కానీ తన సోదరుడి కుమారుడు అర్జున్‌ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో కొడాలి నాని తన రాజకీయ వారసత్వం గురించి ప్రకటనలు చేశారు. సంగతి తెలిసిందే. తనకు 2024 ఎన్నికలే చివరివి అని చెప్పారు. 2029 ఎన్నికల్లో తాను పోటీచేయనని.. తన వయసు గురించి ప్రస్తావించారు. 2029 ఎన్నికల సమయానికి తనకు 58 ఏళ్లు వస్తాయని.. తాను ఆ వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీచేయలేనని చెప్పుకొచ్చారు. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని.. తన ఇద్దరు కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదన్నారు. తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటనతో కొడాలి అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందనే చర్చ జరుగుతోంది. మరోవైపు గుడివాడలో జరిగిన సర్ సదస్సులో మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ, గన్నవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని టీడీపీలో చర్చ జరుగుతోందన్నారు. సర్ విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సర్ కారణంగా తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ఓడిపోయారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వారు పోటీచేసిన నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించడంతోనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సర్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.