ఐపీఎల్ హడావుడి ముగిసింది. ఇంకో ఏడాది వరకు మన స్టార్ ప్లేయర్లనంతా ఒకే చోట చూడటం కుదరదు. ముఖ్యంగా రోహిత్ శర్మ - విరాట్ కోహ్లి అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేరు. అందుకే వాళ్లిద్దరి కోసం బీసీసీఐ ఎక్కువ వన్డే సిరీస్‌లు ప్లాన్ చేసింది. వరకూ టీమిండియా ఫుల్ షెడ్యూల్‌ను ఒకసారి చూద్దాం. టీమిండియా రానున్న ఐపీఎల్ 2027 వరకూ భారీ షెడ్యూలే ప్లాన్ చేసింది. ఈ ఏడాది కాలంలో పది టెస్టులు, 20 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. విరాట్ కోహ్లి - రోహిత్ శర్మ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నారు. ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో వీరి కోసం ఎక్కువ వన్డే షెడ్యూల్‌లు కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్, జింబాబ్వే టూర్లతో పాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడనుంది. 2026లో టీమిండియాఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా అప్ఘనిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు మ్యాచ్‌తోనే మొదలవుతోంది. జూన్ 6న మొహాలీ వేదికగా భారత్ - అప్ఘనిస్థాన్ టెస్టు, జూన్ 13 - 20 వరకు అప్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఐర్లాండ్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. జూలై‌లో ఇంగ్లండ్ - భారత్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ వేదికగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 1 - 11 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు, జూలై 14 - 19 వరకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, కార్డిఫ్ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే జూలై 23 - 26 వరకు జింబాబ్వే‌తో హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో భారత్ వేదికగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 27 - అక్టోబర్ 3 వరకు తిరువనంతపురం, గువాహటి, మొహాలి వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు, అక్టోబర్ 6 - 14 వరకు లక్నో, రాంచీ, ఇండోర్, కోల్‌కతా వేదికగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. 2027లో టీమిండియాజనవరిలో జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. జింబాబ్వేతో జనవరి 3 - 9 వరకు ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్, వాంఖడే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 21 - ఫిబ్రవరి 27 వరకు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికగా ఈ ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.