జపాన్‌లో దాదాపు 30 వేల మంది పాకిస్థానీలు నివసిస్తున్నారు. మెరుగైన జీవనం కోసం జపాన్‌కు వలస వెళ్లిన పాకిస్థానీలు, అక్కడ ముందస్తు అనుమతులు లేకుండా మసీదు నిర్మించుకోవడం దౌత్యపరమైన, న్యాయపరమైన వివాదానికి తీసింది. రాజధాని టోక్యో సమీపంలోని కావాగోయ్‌లో నిర్మించిన ఈ మసీదును ఏప్రిల్ 3న జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ప్రారంభించారు. అయితే జపాన్ సిటీ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం సరైన అనుమతులు పొందకుండానే మసీదును నిర్మించారని అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఈ మసీదు కూల్చివేత ముప్పును ఎదుర్కొంటోంది.కావాగోయ్ సిటీలో ఈ మసీదును నిర్మించిన ప్రాంతంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ముందుగానే అనుమతులు పొందాలి, లేకపోతే అక్కడ నిర్మాణాలు చేపట్టడంపై నిషేధం ఉంది. అయినా సరే ముందస్తు అనుమతులు తీసుకోకుండా మసీదు నిర్మాణాన్ని చేపట్టారని కవాగోయ్ సిటీ అధికారులు తెలిపారు.దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఫలితంగా ప్లానింగ్ నిబంధనల ఉల్లంఘన కాస్తా.. కూల్చివేతకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.అనుమతులు లేకుండా, నిషేధిత ప్రదేశంలో మసీదు నిర్మాణం చేపట్టిన వ్యవహారం వివాదానికి దారి తీయడంతో.. ఈ మసీదు నిర్మాణ ప్రక్రియ నుంచి టోక్యోలోని పాకిస్థాన్ ఎంబసీ దూరం జరిగింది. కట్టడాల విషయంలో స్థానిక నియమాలను పాటించాలని, ముఖ్యంగా మతపరమైన భవనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జపాన్‌లోని తమ దేశ ప్రజలకు సూచిస్తూ పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకొని మసీదును నిర్మించామని నిర్వాహకులు చెప్పిన తర్వాతే తమ రాయబారి ప్రారంభోత్సవానికి వెళ్లారని పాక్ ఎంబసీ చెప్పుకొచ్చింది. జపాన్‌లో సాధారణంగా స్థానిక ప్రభుత్వాల నుంచి సరైన అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించరని పాకిస్థాన్ ఎంబసీ స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఈ మసీదు నిర్మాణానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ఎంబసీ ప్రకటించింది. స్థానిక అధికార యంత్రాంగానికి సహకరించాలని.. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో స్థానికులు సమాచారం ఇవ్వాలని కూడా జపాన్‌లోని తమ దేశ పౌరులకు పాకిస్థాన్ ఎంబసీ సూచించింది.అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించేందుకు అవసరమైన ప్రక్రియను కావాగోయ్ అధికారులు మొదలుపెట్టారని తెలుస్తోంది. మసీదు నిర్వాహకులు నిబంధనల ఉల్లంఘన నోటీసులు జారీ చేయడంతోపాటు.. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా అధికారులు వారికి సూచించారు.భూకంపాలు ఎక్కువగా వచ్చే జపాన్‌లో కఠినమైన జోనింగ్, నిర్మాణ నిబంధనలు అమల్లో ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులను ఎంతో కఠినంగా నియంత్రించే పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తారు. సిటీ ప్లానింగ్ చట్టా్న్ని ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని తేలితే.. పనులు నిలిపివేయాలని ఆదేశించొచ్చు, జరిమానాలు లేదా కూల్చివేత ఆదేశాలు జారీ చేయొచ్చు.మసీదు ప్రారంభోత్సవానికి పాకిస్థాన్ రాయబారి హాజరు కావడంతో.. ఇందులో దౌత్య పరమైన కోణం కూడా ఉండటం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఈ కేసు విషయంలో జపాన్ అధికారులు, పాకిస్థాన్ ఎంబసీ మధ్య మున్ముందు కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.