ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. మంగళవారం రోజున ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. మంగళవారం రోజున రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వానలు కురిసే ఆస్కారం ఉందని అంచనా వేశారు. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించింది. తెగిపడిన విద్యుత్ వైర్లకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ఇక మంగళవారం రోజున వర్షాలతోపాటుగా కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ,తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక సోమవారం రోజున అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరులో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.