తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా భానుడి భగభగలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న వాతావరణం.. సాయంత్రం కాగానే ఒక్కసారిగా మారిపోతోంది. ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండానే ఆకాశం మేఘావృతమై.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వింత వాతావరణ మార్పులు సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇటీవల కాలంలో కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయ రంగానికి తీరని నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట దిగుబడులు కళ్లముందే వరదపాలు కావడం రైతులను కలచివేస్తోంది. మార్కెట్ యార్డులు, కల్లాలు, రవాణా కోసం వాహనాలలో నింపిన ధాన్యం సైతం తడిసి ముద్దయింది. తగినన్ని రక్షణ చర్యలు తీసుకునే లోపే ప్రకృతి ప్రకోపించడంతో పండించిన పంట వానపాలై తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో ఈనెల 6 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు. నేడు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. కాగా, ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ.. పగటిపూట ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండతో పాటు దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. గత ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఇదే రకమైన గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది.గత ఐదేళ్లతో పోలిస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బ మరణాల సంఖ్య కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో వానాకాలం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడానికి మరో 10 రోజులకు పైగా సమయం పట్టేలా ఉంది. జూన్ 6 తర్వాతే వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.