RCB విజయోత్సవం.. చరిత్ర సృష్టించి సంబరాల్లో మునిగిన కోహ్లి, పటిదార్!

Wait 5 sec.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ ప్లేయర్లు విజయం తర్వాత సంబరాల్లో మునిగిపోయారు. విరాట్ కోహ్లి, కెప్టెన్ రజత్ పటిదార్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఛేజింగ్‌లో తన మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్న కోహ్లి 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈజీ టార్గెట్ అయినప్పటికీ వరుస వికెట్లు పడిన సమయంలో కోహ్లి ఆడిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మామూలు మ్యాచ్‌లలో గెలిస్తేనే కోహ్లి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి వరుసగా ఆర్సీబీ రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంతో విరాట్ కోహ్లి తోటి ప్లేయర్లతో కలిసి సంబరాల్లో మునిగిపోయాడు. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా నియమితుడైన రజత్ పటిదార్ తొలి ఏడాదే ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలిపి.. విరాట్ కోహ్లి 18 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఇప్పుడు మళ్లీ వరుసగా రెండోసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టి కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. టైటిల్ అందుకునే సమయంలో మాట్లాడిన రజత్ పటిదార్ అభిమానులకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. ఈ విజయం ఆర్సీబీ ఫ్యాన్స్‌కి అంకితమని.. గతేడాది ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కోసం ఈ టైటిల్ అంటూ తెలిపాడు. ఈ సాలా నూ కప్ నమ్దే అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. ట్రోఫీ అందుకున్న తర్వాత ఆర్సీబీ ప్లేయర్లు గ్రౌండ్‌లో సంబరాలు చేసుకున్నారు. స్పెషల్ ఫొటో సెషన్‌లో పాల్గొన్న ప్లేయర్లు.. ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఫుల్ జోష్‌లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోవడంతో దాదాపు చేతులెత్తేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో 155/8 పరుగులు చేయగలిగింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 పరుగులతో మంచి ఆరంభం ఇవ్వడం.. కోహ్లి 75 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఆర్సీబీ 18 ఓవర్లలో 161/5 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.