ఛేజింగ్‌లో విరాట్ కోహ్లిని మించిన బెస్ట్ బ్యాటర్ మరొకడు లేడు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఇదే నిజం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడూ.. అదీ ఛేజింగ్‌లో ఆడే తీరు చాలా అద్భుతం. ఎన్ని బంతులకు ఎంత కొట్టాలి, ఎన్ని వికెట్లు పడ్డాయి.. ఏ టైమ్ ఎలా ఆడాలి అని కింగ్ కాలిక్యులేట్ చేసుకుంటూ జట్టుకు విజయాన్ని అందిస్తాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ విరాట్ కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో ఇన్నింగ్స్‌ని నిలబెట్టి ఆఖరి వరకూ క్రీజులో ఉండి విన్నింగ్ షాట్‌తో ఆర్సీబీకి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఒత్తిడిలో కూడా ప్రత్యర్థి బౌలర్లను చురుకుగా ఎదుర్కొంటూ.. ఎక్కడా టెంపర్ కోల్పోకుండా కూల్‌గా బౌండరీలు, సింగిల్స్ తీస్తూ ఛేజ్ మాస్టర్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో మరోసారి చూయించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్లోగా ఉండటంతో బౌలర్లకు స్వర్గధామంగా మారింది. ఆరంభంలోనే గిల్, సాయి సుదర్శన్ అవుటవ్వడం.. ఆ తర్వాత బట్లర్ స్టంప్ అవుట్ అవడంతో మ్యాచ్ అప్పుడే చేజారిపోయింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో గౌరవప్రధమమైన 155/8 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్ ఛేజింగ్‌లో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. వెంకటేశ్ అయ్యర్ (32) క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీలు బాదడంతో ఆర్సీబీకి కాస్త రిలీఫ్ దొరికింది. అయితే దేవదత్ పడిక్కల్ 1, రజత్ పటిదార్ 15, కృనాల్ పాండ్యా 1 పరుగు చేసి అవుటవ్వడంతో ఆర్సీబీ క్యాంప్‌లో కొంత టెన్షన్ నెలకొంది. 9 ఓవర్లలో 91 పరుగులు చేసినా, నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ డగౌట్‌ కొంచెం టెన్షన్ అయింది. అదే సమయంలో అసలైన ఛేజ్ మాస్టర్ కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ బయటకొచ్చింది. జట్టుకు తానున్నానంటూ ఆడిన తీరు అద్భుతం. సింగిల్స్ తీస్తూనే మరోవైపు బౌండరీలు బాదుతూ రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి 42 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 18 ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.