Gig Workers: దేశంలో యాప్ ఆధారిత ఆహార డెలివరీ, ప్రయాణ సేవలు అందించే జొమాటో, స్విగ్గీ, ఓలా ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పని చేస్తున్న గిగ్ వర్కర్స్‌కి కేంద్రం నుంచి అదిరే శుభవార్త వచ్చింది. నిత్యం లక్షల ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ, వేలాది మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తున్న కేంద్రం కసరత్తు ముమ్మరం చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ ఏటీ పెడ్నేకర్ తెలిపారు. గిగ్ కార్మికుల సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గిగ్ కార్మికులకు సోషల్ సేక్యూరిటీ కల్పించేందుకు ప్రభుత్వం ఫండ్ మేనేజర్లతో చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1 కోటి మంది గిగ్ కార్మికులు ఉన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడండో 2030 నాటికి వారి సంఖ్య 2.5 కోట్లకు పెరగనుందని అశుతోష్ ఏటీ అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. గిగ్ కార్మికుల వివరాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లు తమ వద్ద పని చేసే గిగ్ కార్మికుల పూర్తి వివరాలను 2026 జూన్ 22లోగా కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇ-శ్రమ్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ప్రభుత్వం గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఏ కార్మికులు, ఏయే ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారో రియల్-టైమ్ ఆధారంగా తెసుకోవచ్చని చెప్పారు. కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు, వాటి పోర్టబిలిటీని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అశుతోష్ ఏటీ పెడ్నేకర్ అభిప్రాయపడ్డారు. 'మన శ్రామిక శక్తిలో అధిక భాగం ఇప్పుడు గిగ్, ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థలో చేరిపోతున్నారు. దీనిలో ఉన్న సామర్థ్యం అపారమైనది. నేడు, ఈ రంగంలో సుమారు 1 కోటి మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా, ఈ దశాబ్దం చివరి నాటికి ఈ సంఖ్య సుమారు 2.5 కోట్లకు చేరే అవకాశం ఉంది. నానాటికీ పెరుగుతున్న సంఖ్యతో ప్రభుత్వం ఈ రంగంపై మరింతగా దృష్టి సారిస్తోంది. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని దృఢ సంకల్పంతో ఉంది ' అని కేంద్ర కార్మిక శాఖ జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ అశుతోష్ పెడ్నేకర్ పేర్కొన్నారు.