LPG Price: దేశంలో మరోసారి ధరల బాంబు పేలింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ (ఎల్‌పీజీ గ్యాస్) ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత వంటి చాలా అంశాలు ధరలు పెంచేందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ. 42 చొప్పున ధర పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ పెంపు కోల్‌కతాలో రూ. 53.50గా ఉంది. ఇక 5 కిలోల ఫ్రీట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లపై రూ. 11 చొప్పున పెంచారు. అయితే, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ గృహ వినియోగ సిలిండర్ల ధరలను మార్పలేదు. మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం రిటైల్ ధరలను ఏకకాలంలో నిర్ణయిస్తాయి. ఇతర సంస్థల గ్యాస్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 42 మేర పెంచింది. వాణిజ్య సిలిండర్ రిటైల్ ధర ఢిల్లీలో రూ. 3113.50కి చేరింది. ఇక కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 53.50 మేర పెరగడంతో రూ. 3,255.50కి చేరింది. ఇక 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 11 మేర పెరగడంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 821.5కు చేరింది. హైదరాబాద్‌లో కొత్త రేట్లుతాజా సవరణల ప్రకారం హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ్ ధర రూ. 52 మేర పెరిగింది. పెరిగిన ధర జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న ధరకు అదనంగా రూ. 52 మేర జతకలవడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,367కు చేరుకుంది. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి సరఫరాకు అంతరాయం సంగతి తెలిసిందే. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ తగినంత నిల్వలను నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ధరల సవరణ జరిగింది.