ఏపీలో సంగీతం నేర్చుకోవాలనుకునేవారికి టీటీడీ అధ్బుత అవకాశం కల్పించింది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో 2026-27 విద్యా సంవత్సరానికి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌ు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు కాలేజీలో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు.. వాటిని వెంటనే పూర్తి చేసి ద‌ర‌ఖాస్తులు అందజేయాలి. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారని టీటీడీ తెలిపింది.'తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్ టైమ్‌ / పార్ట్‌టైమ్ వ్యవ‌ధి గ‌ల కోర్సులలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి. ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయ' అని టీటీడీ తెలిపింది. 'ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే విద్యార్థుల‌కు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఇతర వివరాలకు 0877-2264597, 9848374408, 9440793205, 9642796991 నంబ‌ర్ల‌లో సంప్రదించాలి' అని టీటీడీ సూచించింది.తిరుమలలో పౌర్ణమి గరుడసేవతిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సర్వలోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. “సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు అని అర్థం. ప్రజలను ధర్మమార్గంలో నడిపించి వారి సంక్షేమాన్ని కాంక్షించే రాజులందరికీ అధిపతి భగవంతుడే అనే సనాతన సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. జగన్నాయకుడైన శ్రీహరి సమస్త భూపాలులను పరిపాలించే రాజాధిరాజుగా ఈ వాహనంపై దర్శనమిస్తారు.