ఆస్ట్రేలియా ప్లేయర్లు పాకిస్తాన్ డెబ్యూ బౌలర్ అల్లాడించాడు. ఐపీఎల్ ముగించుకుని ఆస్ట్రేలియా టూర్‌లో జాయిన్ అయిన ప్లేయర్లు అంతగా రాణించలేకపోయారు. దానికి తోడు అండర్ 19లో అద్భుత ప్రదర్శన చేసిన పాక్ బౌలర్.. తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఆసీస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ 1 - 0తో ఆధిపత్యం సాధించింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బోల్తా కొట్టింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లకు హడలెత్తించారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు అలెక్స్ క్యారీ - మాథ్యూ షార్ట్ తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించారు. అలెక్స్ క్యారీ త్వరగా అవుటైనప్పటికీ మాథ్యూ షార్ట్ మాత్రం నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువ బౌలర్ అరాఫత్ ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌ను ఒకే ఓవర్‌లో అవుట్ చేయడం.. ఆ తర్వాత ఓవర్‌లోనే కామెరూన్ గ్రీన్ వికెట్ కూడా తీసుకోవడంతో ఆసీస్ మిడిలార్డర్ కుప్పకూలింది. లబుషేన్, గ్రీన్ డకౌట్ కావడంతో 68 పరుగులకే ఆసీస్ 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును మాథ్యూ షార్ట్ - మాట్ రెన్షా కలిసి ముందుకు తీసుకెళ్లారు. షార్ట్ 76 బంతుల్లో 55, మాట్ రెన్షా 63 బంతుల్లో 61 పరుగులు చేసి అవుటయ్యారు. ఆఖర్లో కూహ్నెమాన్ 24 పరుగులు చేయడంతో 44.1 ఓవర్లలోనే 200 పరుగులకు ఆలౌట్ అయింది. అరాఫత్ మిన్హాస్ 10 ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 32 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. బాబర్ ఆజామ్ 94 బంతుల్లో 69 పరుగులు చేయగా, ఘాజీ ఘోరీ 92 బంతుల్లో 65 పరుగులు చేసి మిడిలార్డర్‌లో జట్టుకు మంచి భాగస్వామ్యం అందించారు. ఐదు వికెట్లు తీసుకున్న అరాఫత్ 17 బంతుల్లో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న అరాఫత్ మిన్హాస్ ఐదు వికెట్లతో పాటు 18 పరుగులు కూడా చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.