ఐటీ కారిడార్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రేంజ్‌లో లోకల్ రైల్వే స్టేషన్లు.. త్వరలోనే అందుబాటులోకి..!

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలోని సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతి కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు నగరంలో వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే బేగంపేట రైల్వేస్టేషన్‌లో అధునాతన సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాగా.. ఐటీ కారిడార్, కీలక నివాస ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న హఫీజ్‌పేట, మల్కాజిగిరి, హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తాజా నివేదికల ప్రకారం హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ స్టేషన్లలో 98 శాతం పనులు ముగియగా.. మల్కాజిగిరి స్టేషన్‌లో 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే వీటిని అధికారికంగా ప్రారంభించి ప్రయాణికులకు అంకితం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.నిజానికి, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ ఆధునీకరించిన స్టేషన్లను ప్రారంభించాలని రైల్వే శాఖ తొలుత భావించింది. అయితే కొన్ని అనివార్య కారణాలు, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మూడు ప్రధాన స్టేషన్లతో పాటు నగరంలోని మిగిలిన సబర్బన్ రైల్వే కేంద్రాలైన ఉప్పుగూడ, మలక్‌పేట్, మేడ్చల్, షాద్‌నగర్, ఉందానగర్, యాకుత్‌పుర స్టేషన్లలో కూడా రెండో దశ కింద పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి.ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, నిత్యం ప్రయాణించే వేలాది మందికి సేవలు అందించడమే లక్ష్యంగా హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ స్టేషన్ రూపరేఖలను మార్చేశారు. ఫేజ్-1కు రూ. 25 కోట్లు, ఫేజ్-2కు రూ. 10 కోట్లు మెుత్తంగా సుమారు రూ. 35.61 కోట్లు కేటాయించారు. ఇక్కడ రోజువారీ ప్రయాణికుల సంఖ్య సుమారు ఆరు వేల మంది వరకు ఉంటుంది. ఇక్కడ వారాంతాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే 60కి పైగా ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లు ఆగుతాయి. సరికొత్త డిజైన్‌తో కూడిన స్టేషన్ భవన నిర్మాణం, 12 మీటర్ల వెడల్పుతో కూడిన భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, ప్లాట్‌ఫామ్‌లపై అదనపు షెల్టర్లు, కార్పొరేట్ స్థాయిలో ఆధునిక టాయిలెట్లు, కొత్త లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనుల పూర్తిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ.. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని ప్రకటించారు. రోజువారీగా ఇక్కడ 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడ రోజూ 60 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిలుస్తాయి. ప్లాట్‌ఫామ్ పైకప్పు, స్టేషన్ పరిసరాల ఆధునీకరణ, 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, కొత్త సైన్ బోర్డులు, ఎల్‌ఈడీ లైటింగ్, 2 అత్యాధునిక లిఫ్టులు, 2 ఎస్కలేటర్లు అమర్చారు.నగరానికి తూర్పున ఉన్న అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన మల్కాజిగిరి స్టేషన్ పునరాభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయి. సబర్బన్ రైళ్లతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే 27 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం ఉంది. రోజుకు సుమారు 3 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు. కొద్దిరోజుల్లోనే ఈ స్టేషన్ నూతన ప్రధాన ముఖద్వారం అందుబాటులోకి రానుంది. స్టేషన్ విస్తరణ పనుల్లో భాగంగా ప్రయాణికుల కోసం ఏసీ విశ్రాంతి గదులు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు సిద్ధమవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా లోకల్ రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి, మెట్రో స్టేషన్ల తరహాలో కార్పొరేట్ లుక్ సంతరించుకున్నాయి. ఈ ఆధునిక వసతుల వల్ల ప్రయాణికుల వేచి ఉండే సమయం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా.. వృద్ధులు, దివ్యాంగులకు ఎస్కలేటర్లు, లిఫ్టుల ద్వారా ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లడం ఎంతో సులభతరం కానుంది.