ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఓ అనుకోని ఇబ్బంది ఎదురైంది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ మీద విజయం తర్వాత అహ్మదాబాద్ వచ్చేందుకు ప్రకృతి సహకరించలేదు. చండీగఢ్‌లో ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా జట్టు అహ్మదాబాద్ ప్రయాణం ఆలస్యమైంది. దాంతో ప్రాక్టీస్ చేసేందుకు సమయం తగ్గిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌పై క్వాలిఫయర్ 2లో విజయం సాధించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ శనివారం మధ్యాహ్నం చార్టర్ విమానంలో అహ్మదాబాద్‌కు బయల్దేరాల్సి ఉంది. పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చండీగఢ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో గుజరాత్ టైటాన్స్ చార్టర్ ఫ్లైట్స్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో శనివారం సాయంత్రం వరకు జట్టు అహ్మదాబాద్ చేరుకోలేకపోయింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌కి 24 గంటల కన్నా తక్కువ సమయంలో అహ్మదాబాద్ చేరుకోవడంతో గుజరాత్‌కు ఇప్పుడు సవాల్‌గా మారింది. ప్లేయర్లకు ఎక్కువ విశ్రాంతి లేకపోవడంతో పాటు ప్రాక్టీస్ కూడా తగ్గిపోయింది. క్వాలిఫయర్ 1లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బుధవారానికే అహ్మదాబాద్ చేరుకుంది. ఇప్పటికే ఆ జట్టు రెండు ప్రాక్టీస్ సెషన్లు కూడా పూర్తి చేసింది. దాంతో గుజరాత్‌తో పోల్చితే ఆర్సీబీకే ఎక్కువ విశ్రాంతి దొరికింది. ఇదే విషయాన్ని కెప్టెన్ రజత్ పటిదార్ కూడా అంగీకరించాడు. "క్వాలిఫయర్ 1 తర్వాత మాకు విశ్రాంతి దొరికింది. రికవరీ అవడానికి కూడా సమయం ఉంది. గుజరాత్ మాత్రం క్వాలిఫయర్ 2 ఆడి నేరుగా వస్తోంది. ఇది మాకు కొంత అడ్వాంటేజ్ కావొచ్చు. కానీ పెద్ద తేడా కాదు. మా రెండు జట్లు కూడా అద్భుతంగా ఆడి ఫైనల్స్ వరకూ వచ్చాయి" అని రజత్ పటిదార్ అన్నాడు. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరిగిన ధర్మశాల, ముల్లాన్‌పూర్‌‌లో వర్ష సూచనలు కనిపించినా అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో వర్షం ముప్పు పెద్దగా లేదని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ఫైనల్‌కి కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం.. వర్షం పడటం, డ్రమెటిక్ మూమెంట్‌లో సీఎస్కే విజయం సాధించడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది.