ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం.. అర్హులైన పేదలకు ప్రతి నెల మొదటి తారీఖునే ఆర్థిక అండను అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి జూన్ నెలకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. గడువులోగా నిధులను చేర్చాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 2,728 కోట్లను ఒకే విడతగా విడుదల చేసింది. జూన్ 1న సోమవారం ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అత్యంత పారదర్శకంగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు.ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి ఆర్థిక భరోసా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ సారి సచివాలయాల సిబ్బందిని, ప్రత్యేక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేసి.. నేరుగా వారి ముంగిటకే లబ్ధిని చేకూరుస్తోంది. ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తింపు ఆధారంగా నూతన పెన్షన్ నగదును అందజేయనున్నారు.ఈ నెల పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మరో మానవీయ కోణాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది. 60 ఏళ్లు దాటిన భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే.. జీవించి ఉన్న భాగస్వామికి ఇచ్చే ఈ పింఛన్ల కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల ఎంతోమంది అర్హులైన, ఆసరా కోల్పోయిన కుటుంబాలకు కొత్తగా ప్రభుత్వ తోడ్పాటు లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందుకోనున్నారు. ఇందులో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు ఉన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెనకడుగు వేయకుండా అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. ఇప్పటివరకు కేవలం సామాజిక భద్రతా పింఛన్ల కోసమే ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేయడం విశేషం. ఇంత భారీ ఎత్తున నిధులను సంక్షేమానికి మళ్లించడం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. లబ్ధిదారులకు ఎక్కడా సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు గాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులను సచివాలయాలకు రప్పించకుండా.. నూటికి నూరు శాతం ఇళ్ల వద్దే పంపిణీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.