: దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్‌లో భాగంగా ఆయన దేశంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడారు. వేసవి తీవ్రత నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వ విభాగాల నిబంధనలు పాటించడంతో పాటు శరీరాన్ని చల్లబరిచే సాంప్రదాయ దేశీయ పానీయాలను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ..!ప్రస్తుతం దేశంలోని అత్యధిక ప్రాంతాలు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తగినంత నీరు తాగుతూ, శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేస్తున్న వాతావరణ మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు" అని పీఎం మోదీ స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండల వల్ల సాధారణ ప్రజల దైనందిన జీవితం ఎంతో దుర్భరంగా మారుతోందని, ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకుంటూనే, చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్న ఇతరుల పట్ల కూడా మానవత్వాన్ని, సహాయ గుణాన్ని చాటాలని ఆయన కోరారు.దేశీయ పానీయాలివే.. కచ్చితంగా తాగండంటూ..!ఎండలను తట్టుకోవడానికి మన దేశంలో అనాదిగా వస్తున్న విభిన్న సాంప్రదాయ పానీయాలను ఈ వేసవిలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే ఈ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఇవి 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' అనే ఐక్యతా స్ఫూర్తిని చాటుతాయని కొనియాడారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలను ఆయన ప్రస్తావించారు.ఉత్తర భారతదేశంలో లభించే 'ఆమ్ పన్నా' (పచ్చి మామిడికాయ రసం) ఎండ దెబ్బ తగలకుండా రక్షిస్తుందన్నారు. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద గ్లాసులతో తాగే 'లస్సీ' శరీరానికి చలవ చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల ప్రజలు తమ ప్రతి భోజనంలోనూ 'మజ్జిగ'ను తప్పనిసరిగా భాగం చేసుకుంటారని గుర్తు చేశారు. బీహార్, జార్ఖండ్, తూర్పు యూపీ ప్రాంతాల్లో తాగే 'సత్తు శర్బత్' (వేయించిన శనగపిండి పానీయం) కడుపు నింపడమే కాకుండా తక్షణ శక్తిని ఇస్తుందన్నారు. కొంకణ్, గోవాలో దొరికే 'కోకం శర్బత్', 'సోల్ కఢి'లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని చెప్పారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో లభించే 'పానకం', 'నీర్ మోర్', 'సంబారం' వంటివి వేసవికి ఎంతో మేలైనవని చెప్పారు. ఒడిశాలో ప్రత్యేకంగా తయారుచేసే 'బేలా పన్నా' (మారేడు పండ్ల రసం) ఆరోగ్యానికి ఎంతో మంచిదని వివరించారు. ప్రజలంతా ఈ వేసవి కాలంలో ఈ దేశీ పానీయాలను తాగి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. మరోవైపు దేశంలో నెలకొన్న ఈ అసాధారణ ఉష్ణోగ్రతల ప్రభావం, నష్టాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల మంత్రులను అప్రమత్తం చేశారు. వడగాల్పుల తీవ్రతను ఎదుర్కొనేందుకు, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఈ కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశమంత ఒకే తాటిపైకి వచ్చి 'హోల్ ఆఫ్ నేషన్' విధానంతో ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి గట్టిగా నొక్కిచెప్పినట్లు వెల్లడించారు.