ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ టీమ్ ఓటమిపాలయింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్, రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలయింది.టీ20 వరల్డ్‌కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో తెలుగమ్మాయి అందర్నీ ఆకట్టుకుంది. టీమిండియా స్పిన్ విభాగం ఎంత బలంగా ఉందో నిరూపించింది. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1 - 1తో సమమైంది. దాంతో మూడో మ్యాచ్‌‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. మహిళల టీ20 వరల్డ్‌కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. స్కోర్ చేస్తున్న బ్యాటర్లను శ్రీ చరణి అద్భుత స్పిన్‌తో పెవిలియన్‌కు పంపింది. దాంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శ్రీ చరణి నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకుంది. శ్రేయాంక పాటిల్ కూడా నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకుంది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. తొమ్మిది ఓవర్లకే 70 పరుగులు చేయడంతో ఓవర్లు మిగిల్చి మ్యాచ్ గెలుస్తారని అనుకున్నారు. కానీ స్మృతి మంధాన అవుటైన తర్వాత సీన్ మారిపోయింది. స్మృతి మంధాన 32, షెఫాలీ వర్మ 22, యస్తికా భాటియా 33 రిటైర్డ్ హట్, హర్మన్ ప్రీత్ కౌర్ 28 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక మిగతా ఏ బ్యాటర్ కూడా పది పరుగులు కూడా దాటలేకపోవడంతో 20 ఓవర్లలో 142/9 పరుగులు చేసి 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం శ్రీ చరణి మాట్లాడుతూ గెలిచుంటే 2 - 0తో కాన్ఫిడెన్స్ పెరిగేదని చెప్పింది. కానీ, నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ తమకు సవాలు అని, దాన్ని స్వీకరిస్తామని చెప్పింది. ఇక తన పర్ఫార్మెన్స్ గురించి చెబుతూ కొత్త ప్రయోగాలు చేయనని చెబుతూనే బంతిని టర్న్ చేసి బ్యాటర్లను ఇరాకటంలో పెడతానని చెప్పింది. "ప్రతీ మ్యాచ్ కూడా మాకు ముఖ్యమే. గెలిస్తే 2-0తో ఇంకాస్త ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆఖరి మ్యాచ్ మాకు సవాల్. నేను నా బలాన్న నమ్ముతాను. కొత్తగా ప్రయోగాలు చేయను. సరైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తాను. బంతిని టర్న్ చేయడం నా ప్రధాన బలం" అని చెప్పింది.