తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పార్టీతో ముందుకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన జెండాలో పసుపు రంగు ఉండటంపై మాజీ ఎమ్మెల్సీ స్పందించారు. ప‌సుపు రంగు అంటే త‌న‌కు చాలా ఇష్టమని.. భూమి పుట్టిన‌ప్పటి నుంచి ప‌సుపు రంగు ఉంద‌ని పేర్కొన్నారు. కేవ‌లం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పసుపు రంగు సొంతం అని చెప్పడం అన్యాయమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజ‌ల‌కు ప‌సుపు అంటే చాలా సెంటిమెంట్ అని కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఎక్కువ పండించేది పసుపు పంటేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ప్రతీ ఆడ‌బిడ్డకు ప‌సుపు అంటే ఒక సెంటిమెంట్ అని తెలిపారు. ఆడ‌బిడ్డలు తమ జీవితాంతం ప‌సుపు, కుంకుమ‌లు ఉండాల‌ని కోరుకుంటార‌ని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ప‌సుపు అంటే వెలుతురు, స‌మృద్ధి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం స‌మృద్ధిగా ఉండాల‌ని తాను పసుపు రంగును తన జెండాలో పెట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించే స్థాయికి తాము ఎదిగామ‌ని అందుకే త‌న జెండా రంగులో జాగృతి జెండాలోని ఆకుప‌చ్చ రంగును కూడా తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ రైతుల కోసం, మైనారిటీ వర్గాలను కూడా తెలంగాణ రక్షణ సేన రిప్రెంజెంట్ చేస్తుందని.. అందుకే ఆకుప‌చ్చ రంగుకు ఎంచుకున్నట్లు కవిత తెలిపారు. నీలి రంగు అనేది శ్రామికుల రంగు అని వెల్లడించారు. ఎస్సీలు, శ్రామిక వర్గాలు, సామాజిక తెలంగాణ కోసం తమ పార్టీ జెండాలో నీలి రంగు చేర్చినట్లు వివరించారు. కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీలో ఆకుపచ్చ రంగుతోపాటు పసుపు పచ్చ జెండాను ఎందుకు ఉంచారని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. కవిత కొత్త పార్టీ పెట్టడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని పలువురు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మరికొందరు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారని ఆరోపించారు. అయితే తన పార్టీ జెండాలోని ప‌సుపు రంగుకు, పార్టీకి చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. త‌న‌ను ఎవ‌రూ న‌డిపించ‌డం లేద‌ని.. తాను స్వతంత్య్రంగానే రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని స్పష్టం చేశారు.