62 ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు విడాకులు ఇస్తానంటే అర్థం ఉందా? విష్ణుకుమార్ రాజు

Wait 5 sec.

విశాఖపట్నం విమానాశ్రయం భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. టీసీఎస్, గూగుల్, వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖకు విమానాశ్రయం లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని పక్కనపెట్టి కేవలం భోగాపురం విమానాశ్రయంపైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొనసాగిస్తూ.. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తే బాగుటుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే ఇంధన సంక్షోభం ముగిసిన తర్వాత భోగాపురం ఎయి‌ర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. "భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెలకు రెండున్నర లక్షల మంది ప్రయాణికులు విశాఖ నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఒక్కొక్కరికి రూ. 3 వేలు చొప్పున ఛార్జ్ చేశారని అనుకుంటే సుమారుగా రూ.75 కోట్లు ప్రజాధనం వెచ్చించాల్సి ఉంటుంది. ఏడాదికి 850 కోట్ల నుంచి రూ.900 కోట్లు వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రారంభించిన తర్వాత ఏడాదిలో అంత మొత్తం ప్రజాధనం పెట్టాల్సి ఉంటుంది. కనీసం విశాఖ నుంచి వందేభారత్ రైళ్లు పెంచిన తర్వాత అయినా భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలి. మహానగరంగా విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న సమయంలో భోగాపురంతో పాటుగా విశాఖ విమానాశ్రయాన్ని కూడా కొనసాగించాలి. " అని విష్ణుకుమార్ రాజు కోరారు. "62 ఏళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్టును ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు డిఫెన్స్‌కు ఇచ్చేస్తే.. 62 ఏళ్లు కాపురం చేసి, విడాకులు ఇస్తామన్నట్లుగా ఉంది. కనీసం కొన్ని ఎయిర్ లైన్స్ అయినా ఇక్కడి నుంచి నడిపించాలి. గోవా, ముంబై, ఢిల్లీ, నోయిడా ఇలా రెండు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా విశాఖ, భోగాపురం ఎయిర్‌పోర్టులు ఉండాలి. ప్రయాణికులు ఎవరిని అడిగినా.. విశాఖలో ఎయిర్ పోర్టు ఉండాలంటారు. బీచ్ కారిడార్ అందుబాటులోకి వచ్చేంత వరకూ భోగాపురం, విశాఖ ఎయిర్ పోర్టులను రెండింటిని నడిపించాలి." అని విష్ణుకుమార్ రాజు కోరారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా జులై లేదా ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.