"హాలివుడ్ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు".. వైభవ్‌పై ఐపీఎల్ మాజీ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Wait 5 sec.

ఐపీఎల్ సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ తొలి సీజన్‌లోనే భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌ను షేక్ చేసిన వైభవ్.. 15 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ 2026లో రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఆరెంజ్ క్యాప్ అందుకోవడమే కాకుండా.. క్రిస్ గేల్ రికార్డును కూడా క్రాస్ చేశాడు. వైభవ్ ఆట తీరుకు ప్రపంచమే ఫిదా అయింది. సచిన్ టెండూల్కర్ మొదలు ప్రపంచంలోని అందరు లెజెండ్రీ క్రికెటర్లంతా వైభవ్ సూర్యవంశీని ఆకాశానికి ఎత్తినవారే. తాజాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కూడా వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకరోజు టీ20 క్రికెట్‌ను వైభవ్ సూర్యవంశీ ఏలుతాడని.. హాలీవుడ్ సెలబ్రిటీల కంటే పెద్ద స్టార్ అవుతాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. లలిత్ మోదీ తాజాగా విస్డెన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ టీ20లో డబుల్ సెంచరీ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఎంత ఎదిగినా డబ్బు తలకెక్కనివ్వొద్దు అంటూ సలహా కూడా ఇచ్చాడు. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు కూడా వైభవ్ ముందు సరిపోరు అని చెప్పాడు."ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒక రోజు టీ20ల్లో 200 పరుగులు చేస్తావు. కానీ డబ్బు నీ తలకెక్కినివ్వకు. నువ్వు ప్రపంచంలోనే నెంబర్ వన్ సూపర్ స్టార్ అవుతావు. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కంటే కూడా పెద్ద సెలబ్రిటీగా మారతావు" అని వైభవ్‌కు లలిత్ మోదీ చెప్పాడు. జాతీయ జట్ల కంటే ఫ్రాంఛైజీ క్రికెట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచి మార్పేనని మోదీ సమర్థించుకున్నాడు. "ఇదే భవిష్యత్తు. అమెరికాలో ఎవరూ జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనరు. ఎన్‌బీఏలో ఆడాలని కోరుకుంటారు. అలాగే ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్ జట్టు కంటే మాంచెస్టర్ సిటీ వంటి క్లబ్‌లకు ఆడటానికి ప్రాధాన్యత ఇస్తారు. భవిష్యత్‌లో ఇదే ట్రెండ్ అవుతుంది" అని మోదీ చెప్పాడు.