దంచికొడుతున్న ఎండలు.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి, వర్షాలు ఎప్పట్నుంచంటే..?

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. జూన్ మూడో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడి గాలుల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చే నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుందన్నారు. మే 31న అత్యధికంగా 28 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, జూన్ ఒకటిన 11 జిల్లాలు, జూన్ రెండున 12 జిల్లాలు, అలాగే జూన్ మూడో తేదీన 17 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.శనివారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో 45.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో 45.3 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 45.2 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలో 45 డిగ్రీల సెల్సియస్ చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు తోడవడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తగినన్ని నీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారాలను నిరంతరం తీసుకుంటూ ఉండాలన్నారు. ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా గొడుగులు, టోపీలు, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఈ ఎండల తీవ్రత శనివారం పెద్ద విషాదాన్ని మిగిల్చింది. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు గురై వేర్వేరు జిల్లాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురు వడదెబ్బ కారణంగా కన్నుమూశారు. అలాగే కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, నల్గొండ జిల్లాలో ముగ్గురు మరణించగా,, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. శనివారం నాటికి అరేబియా మహాసముద్రంతో పాటు లక్షద్వీప్, ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించాయని అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను తాకడానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఇవి కేరళను తాకిన తర్వాత మన రాష్ట్రానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 10వ తేదీ తర్వాతే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు ఈ ఎండల తీవ్రత, ఉక్కపోత భరించక తప్పదని, ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.