టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కానీ ఇలా చేస్తే బావుంటుంది: విజయసాయిరెడ్డి సలహాలు

Wait 5 sec.

రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగే అంశాలపై స్పందిస్తున్నారు. గత నెలలో టీడీపీ నిర్వహించిన మహానాడు వేదికగా మంత్రి చేసిన ప్రకటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని చెప్పుకొచ్చారు.. 33శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే సరిపోదంటూ కొన్ని సూచనలు కూడా చేశారు. అసెంబ్లీ టిక్కెట్లలో 33% మహిళలకు కేటాయించాలన్న టీడీపీ నిర్ణయం స్వాగతించదగినదే.. కానీ ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 10శాతం మందికి మాత్రమే రాజకీయ అధికారాన్ని మాత్రమే పొందుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళలకు కేటాయించిన ఈ 33% రిజర్వేషన్లను మంత్రి పదవులు, అసెంబ్లీ/కౌన్సిల్ పదవులు, అలాగే సలహాదారులు, ఓఎస్‌డీలు, బోర్డు సభ్యులు, ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులు వంటి నామినేటెడ్ పదవులకు కూడా వర్తింపజేయాలని సూచించారు. అర్థవంతమైన ప్రాతినిధ్యం కావాలంటే, నిర్ణయాలు తీసుకునే ప్రతి వేదికపైనా మహిళలకు స్థానం ఉండాలి అన్నారు విజయసాయిరెడ్డి. గత నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. తొలిరోజు సభలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని.. అది కూడా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌లో బిల్లు పాసైనా, అవ్వకపోయినా టీడీపీ తరఫున మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో తొలిసారి ప్రసంగం చేయబోతున్నానని.. కీలక ప్రకటన చేయబోతున్నట్లు గత నెల 27న ఉదయం మంత్రి లోకేష్ ఒక ట్వీట్ చేశారు. మహానాడు వేదికపై తన ప్రసంగంలో 33శాతం మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రకటించారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. పార్టీలోని పదవుల్లో అవకాశం కల్పిస్తామని పరకటించారు. అంతేకాదు మహానాడులో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. టీడీపీ సిద్ధాంతాలే బలమని.. చంద్రబాబు కృషితోనే రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. టీడీపీలో కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.