ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూమికి సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22ఏ, గ్రామ కంఠం, నిషేధిత జాబితా, వారసత్వ భూములు సహా ఆయా భూముల రిజిస్ట్రేషన్లకు, క్రమబద్దీకరణకు అనుమతించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సీఎం వివిధ శాఖల పనీతీరుపై ఆర్టీజీఎస్‌ నుంచి సమీక్షించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి జిల్లా స్థాయిలో సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే కేబినెట్ దృష్టికి తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఇళ్లు, ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించి ఆ తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది.సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ పెండింగ్‌కు సంబంధించి ఏదో ఒక సాకు చూపుతూ సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో చాలా కాలం నుంచి ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే క్రమబద్ధీకరించాల్సిన ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయాలన్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఎలాంటి వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉన్న స్థలాలను ప్రతి కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు. ఒకవేళ అప్పటికి మిగిలితే వాటిని ఎలా పరిష్కరించాలనే అంశంపై ఆలోచన చేద్దామన్నారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాటరైట్ గనుల వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. 'లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయింది. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది. పాత నిబంధనల మేరకు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని లేఖలో సీఎం ప్రస్తావించారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని లేఖలో సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత రూల్స్ కిందనే ప్రాసెస్ చేసి 2 ఏళ్లు వెసులుబాటు ఇవ్వాలని లేఖలో కోరారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి నిలబడుతుందని' సీఎం లేఖలో స్పష్టం చేశారు.