: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతం వద్ద యథాతథంగానే ఉంచుతూ మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర నిరాశలోనే ఉన్నారు. కారణం.. ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు మెజార్టీ భాగం పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్.. తమ వడ్డీ డబ్బుల్ని పొందలేదు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈపీఎఫ్ఓ ఈ ప్రాసెస్ ప్రారంభిస్తుంటుంది. కానీ.. ఆలస్యం అవుతున్న కొద్దీ ఉద్యోగులు ఆందోళన చెందుతుంటారు. పీఎఫ్ వడ్డీ డబ్బులు ఇంకెప్పుడు అకౌంట్లో జమ చేస్తుంది..? ఆలస్యమైతే ఏమైనా ప్రయోజనం కోల్పోతామా? ఇలా కంగారు పడుతుంటారు. చాలా మందిలో ఈ టెన్షన్ ఉంటుందని చెప్పొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ వడ్డీ ఎప్పుడు ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లో జమవుతుందనే దానిపై కచ్చితమైన డేట్ ఎప్పుడూ చెప్పదు. కానీ.. ఎప్పుడు జమ చేసినా.. పూర్తి మొత్తం డబ్బులు పడతాయనే హామీ ఇస్తుంది. ఇక్కడ వడ్డీ జమలో ఆలస్యం అయ్యేందుకు పలు కారణాలు ఉంటాయని చెబుతోంది. ఇప్పటివరకు మీకు పీఎఫ్ వడ్డీ కాకుంటే.. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బ్యాంక్‌బజార్.కామ్ సీఈఓ అధిల్ షెట్టి అంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈపీఎఫ్ఓ.. వడ్డీ డబ్బులు తక్షణమే జమ చేయదని.. ఇక్కడ కొంత ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆమోదం, అకౌంట్ల సర్దుబాటు, లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ రికార్డుల్ని అప్డేట్ చేయడం.. ఇలా చాలా పని ఉంటుందని ఇందుకోసం కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు.అయితే ఉద్యోగులు ఎప్పటికప్పుడు పీఎఫ్ పాస్‌బుక్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలని.. అప్పుడే వడ్డీ జమైందా లేదా కనిపిస్తుందని అంటున్నారు. పాస్‌బుక్‌లో 'Int. Updated up to 31/03/2026" అనే దానిని గమనించాలని.. కొన్ని సార్లు పాలనాపర జాప్యం, సాంకేతిక సమస్యల వల్ల ఇది కనిపించదని చెబుతున్నారు. ఇక 2025లో చూస్తే మెజార్టీ భాగం ఈపీఎఫ్ సభ్యులు.. పీఎఫ్ వడ్డీని జూన్, జులై నెలల్లోనే పొందారు. గతంలో ఇంకా పీఎఫ్ వడ్డీని సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో జమ చేసే వారని.. ఇప్పుడు అది ఇంకా ముందుకే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ వడ్డీ జమైందో లేదో తెలుసుకునేందుకు.. పీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే మీరు ఇంట్రెస్ట్ పడిందా లేదా అనేది చూడొచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. ఉమంగ్ యాప్ ద్వారా, ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్ ద్వారా, మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సందర్భాల్లో యూఏఎన్ నంబర్ కావాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా చివరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్, మొత్తం బ్యాలెన్స్ కూడా మెసేజ్ రూపంలో ఫోన్‌కు పొందొచ్చు. 7738299899 నంబర్‌కు EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి.. చివర్లో లాంగ్వేజ్ ENG లేదా TEL ఇలా సెలక్ట్ చేస్కొని టెక్ట్స్ పంపాలి. మెసేజ్ రూపంలో బ్యాలెన్స్ వస్తుంది.