బీజేపీకి అన్నామలై రాజీనామా.. అధిష్ఠానానికి ఐదు పేజీల సుదీర్ఘ లేఖ

Wait 5 sec.

తమిళనాడు నేత, మాజీ ఐపీఎస్ కే అన్నామలై ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన అనంతరం తన రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు ఐదు పేజీల లేఖను అన్నామలైన అందజేశారు. అయితే, అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆమోదించలేదు. గత రెండు రోజులుగా అన్నామలై రాజీనామాపై ఊహగానాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీని వీడి కొత్తగా రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 4న తన పుట్టిన రోజు నాడు రాజకీయ భవిష్యత్తుపై అన్నామలై ప్రకటన చేసే అవకాశం ఉంది.మాజీ ఐపీఎస్ అయిన అన్నామలై.. 'లౌకిక', 'తమిళ-కేంద్రీకృత' దృక్పథంతో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత ఈ పార్టీని ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా ప్రారంభించే అవకాశం ఉంది. తమిళనాడులోని బీజేపీ, ద్రావిడ ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్నామలై సన్నిహితుల ప్రకారం.. ఆయన తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవించి, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను సమస్యల ఆధారంగా వ్యతిరేకించే ఒక రాజకీయ వేదికను ఊహించుకుంటున్నారు.తమిళనాడులో పార్టీ రాజకీయ వ్యూహంపై అన్నామలైకి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొన్నాళ్లు నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పొత్తును పునరుద్ధరించడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక సహా అంశాలపైనా బీజేపీపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నారని వర్గాలు తెలిపాయి.పొత్తులపై ఆధారపడటం కంటే రాష్ట్రంలో ఒక స్వతంత్ర సంస్థాగత పునాదిని నిర్మించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టాలని అన్నామలై వాదించినట్లు తెలుస్తోంది. కానీ, జాతీయ నాయకత్వం విస్తృతమైన డీఎంకే వ్యతిరేక వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం. ఎన్నికల్లో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే పనితీరు తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందని, కొత్త రాజకీయ శక్తులకు ఆస్కారం కల్పించాయని ఆయన సహచరులు పేర్కొంటున్నారు.