కారుణ్య నియామకాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ నియమాకాల్లో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాల్లో పెళ్లైన కుమార్తె అర్హురాలు కాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ మేరకు సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. వివాహమైందన్న కారణాన్ని సాకుగా చూపి అర్హురాలైన కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడం సరికాదని గతంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ పీఎల్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల ధర్మాసనం తేల్చిచెప్పింది. వివాహితులైన కుమారులకు కారుణ్య నియామకం కోసం ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు, వివాహితులైన కుమార్తెలు ఎందుకు అర్హులు కాదని వ్యాఖ్యానించింది.ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహిళ కారుణ్య నియామకం ఆధారంగా తనకు చౌక ధరల దుకాణం డీలర్‌షిప్ లైసెన్స్‌ను ప్రభుత్వం నిరాకరించడంతో అలహాబాద్ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. కుటుంబ నిర్వచనం నుంచి వివాహమైందనే కారణంతో తనను పక్కనపెడుతూ 2019లో యూపీ ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలను ఆమె సవాల్ చేశారు. తనకు వివాహమైనప్పటికీ దివ్యాంగురాలైన తన సోదరిని, తల్లిని చూసుకుంటూ దుకాణాన్ని నిర్వహించినట్లు వివరించారు. తన తల్లి మరణం తర్వాత లైసెన్స్‌ కోసం సదరు మహిళ చేసిన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. అయితే, యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. ఆమెకు లైసెన్స్‌ నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. నాలుగు వారాల్లోగా ఆమెకు లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ‘‘సైదా బేగం కేసు సరైన చట్టాన్ని పొందుపరచలేదు.. ప్రస్తుత కేసులో ఆధారాలను బట్టి.. అప్పీలుదారు (బాధితురాలు) వివాహం తర్వాత కూడా అదే గ్రామంలో నివసిస్తూ, చౌక ధరల దుకాణం నిర్వహణలో తన తల్లికి సహాయం చేసిందని స్పష్టమవుతోంది. తల్లి మరణానంతరం, ఆమె తన సోదరితో పాటు శారీరక వైకల్యం ఉన్న మరో సోదరి బాధ్యతను కూడా స్వీకరించారు... కేవలం ఆమె 'వివాహిత కుమార్తె' అనే కారణంతో ఆమె దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగబద్ధంగా చెల్లని అంశం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.