సమ్మర్ సీజన్ లో కీలకమైన మే నెల ముగిసింది. టాలీవుడ్ బాక్సాఫీస్ బోసిపోయింది. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల మాదిరిగానే 'మే' కూడా వృధాగా పోయింది. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. అన్నీ కలుపుకొని పాతిక సినిమాల వరకూ విడుదలయ్యాయి కానీ.. బాక్సాఫీస్ దగ్గర నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య 'జెట్లీ', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', రవిబాబు 'రేజర్', నందు 'అగ్లీ స్టోరీ' సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. 'వీరభద్రుడు', 'పేట్రియాట్', 'దృశ్యం 3', 'రాజా శివాజీ', 'బ్లాస్ట్' లాంటి డబ్బింగ్ చిత్రాలతో పాటుగా 'మరీచిక', 'రమణి కల్యాణం', 'పురుషః' వంటి మరికొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిల్లో 'వీరభద్రుడు' మూవీ మాత్రమే తెలుగులో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. మిగతావన్నీ తీవ్ర నిరాశ పరిచాయి. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి.'నిన్ను కోరి', 'అతిథి', '1 నేనొక్కడినే' లాంటి రీ-రిలీజ్ సినిమాలు కూడా ఇదే నెలలో వచ్చాయి. మహేష్ బాబు క్రేజ్ తో ఉన్నంతలో కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే, మే నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. థియేటర్లలో సందడి కనిపించలేదు. కొన్ని సిమిమాలకు జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్న చిత్రాలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తీవ్ర నష్టాలతో మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ముగిసింది.అయితే సమ్మర్ సీజన్ మరీ ఇంత డల్ గా ఉండటానికి 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ () ఒక కారణమనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాడు. ఆది వారం రెండు మ్యాచులు ఉండటం వల్ల,, వీకెండ్ కలెక్షన్స్ పై భారీ దెబ్బ పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలపై IPL ప్రభావం ఏ మేరకు పడిందనే చర్చ పక్కన పెడితే.. 64 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన ' - 2026' సమరం ఆదివారంతో ముగిసింది. దీంతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద మళ్లీ హంగామా మొదలవుతుందని టాలీవుడ్ జనాలు ఆకాంక్షిస్తున్నారు. 'పెద్ది' సినిమాతో జూన్ నెల బాక్సాఫీస్ సందడి ప్రారంభం కానుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మళ్లీ జనాలు థియేటర్లకు తరలి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. సినిమా హాళ్ళన్నీ ప్రేక్షకులతో నిండిపోతాయని భావిస్తున్నారు. ఇది కచ్చితంగా హిట్టవ్వాలని కోరుకుంటున్నారు. 'పెద్ది' తర్వాత జూన్ 11న సింగీతం శ్రీనివాస్ 'సింగ్ గీతం'.. 19న సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాలు రాబోతున్నాయి. ఇక జూన్ 26న అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ రిలీజ్ కానుంది. ఇవన్నీ జనాలను థియేటర్లకు రప్పించగలిగితే అందరూ ఆశిస్తున్నట్లు ఇండస్ట్రీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!