హైదరాబాద్‌లో మరో 6 లేన్ల ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్టు మార్గంలో.. రూ.416 కోట్లు కేటాయింపు

Wait 5 sec.

విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లను గుర్తించి.. అక్కడ భారీ ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో మరో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. ఎల్‌బీ నగర్ జోన్‌లో రూ.416 కోట్లతో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ నగరంలోని తూర్పు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టీకేఆర్ కాలేజీ, గాయత్రీనగర్, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ వల్ల ఎయిర్‌పోర్టు మార్గంలో ట్రాఫిక్ తగ్గనుంది. అంతేకాకుండా మీర్‌పేట్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం లభించనుండగా.. ఎల్‌బీ నగర్ నుంచి పాతబస్తీ వైపు ప్రయాణం కూడా మరింత సులభతరం కానుంది. త్వరలోనే భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ పనులు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని ఎల్‌బీ నగర్ జోన్‌లో రూ.416 కోట్ల వ్యయంతో ఈ 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.టీకేఆర్ కాలేజీ జంక్షన్, గాయత్రీనగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద ఈ పనులను ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) టర్న్‌కీ విధానంలో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ చేపట్టనుంది. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రస్తుతం ఈ 3 జంక్షన్ల వద్ద తీవ్రంగా ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్లలో మీర్‌పేట్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ వంటి ప్రాంతాల్లో జనాభా గణనీయంగా పెరగడంతో పాటు.. వాహనాల రాకపోకలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ ప్రాంతాల నుంచి నగరానికి వెళ్లే ప్రయాణికులతో నిత్యం ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఈ 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే నగర తూర్పు భాగాన్ని విస్తరించిన దక్షిణ ప్రాంతాలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మీర్‌పేట్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నాయి. అలాగే ఎల్‌బీ నగర్ జంక్షన్ నుంచి సంతోష్‌నగర్ మీదుగా పాతబస్తీ వైపు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి.మున్సిపల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించి.. త్వరలోనే భూసేకరణ, విద్యుత్ లైన్లు, నీటి పైపులు వంటి యుటిలిటీ షిఫ్టింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నగర తూర్పు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.