తాగునీటి కోసం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గుణదల కొండ ప్రాంత ప్రజల తాగునీటి హక్కుల రక్షణ కోసం గోతిలోకి దిగి ధర్నా నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్న దేవినేని అవినాష్.. నియోజకవర్గంలోని గుణదల కొండ ప్రాంత ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. గద్దెవారి పొలాల పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల కోసం గుణదల కొండ ప్రాంతానికి చెందాల్సిన తాగునీటిని తరలించేందుకు కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ నాయకత్వంలో గుణదల కొండ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామన్నారు దేవినేని అవినాష్. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకుచర్యలు చేపట్టామని తెలిపారు.అయితే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుతున్న నీటిని సైతం దొంగిలించి, అక్రమంగా గద్దెవారి పొలాలకు తరలిస్తోందని దేవినేని అవినాష్ ఆరోపించారు. ఇంత జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కేవలం షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, కుల రాజకీయాలు చేయడంపైనే ఆసక్తి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. రెండు రోజులుగా గుణదల కొండ ప్రాంత ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించకుండా స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని అవినాష్ విమర్శించారు.మరోవైపు దేవినేని అవినాష్ ఆందోళనతో అధికారులు స్పందించారు. గుణదల కొండ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, నీటి తరలింపును అడ్డుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఎస్‌ఈ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, తాగునీటి సమస్య తలెత్తినానేరుగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.