ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన యువతి.. టెన్షన్ లేకుండా నెలకు రూ.60 వేల సంపాదన

Wait 5 sec.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే సమాజంలో ఒక రేంజ్ ఉంటుంది. పెళ్లి కావాల్సిన యువతీయువకులకు ఐటీ జాబ్ ఉంటేనే వివాహాలు అయ్యే పరిస్థితికి వచ్చిందంటే.. ఈ టెక్ జాబ్స్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఇక ఐటీ జాబ్స్‌ కోసం బీటెక్‌లు, ఎంటెక్‌లు పూర్తి చేసిన యువతీయువకులు.. కొత్త కొత్త కోర్సులు చేసుకుంటూ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఐటీ జాబ్స్ చేసే వారు మాత్రం అందులో ఉండే పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేక తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. అలాంటి వారు టాక్సిక్ జాబ్స్ వదిలేసి.. నచ్చిన పని చేసుకుంటున్నామని.. సోషల్ మీడియా వేదికగా చాలా మంది చెప్పినప్పుడు.. వారికి మద్దతుగా నెటిజన్లు నిలుస్తూ ఉంటారు.తాజాగా ఓ యువతి కూడా ఐటీ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు భరించలేక ఆమె తన కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పింది. నిత్యం ఆమె ఆటో నడుపుతూ నెలకు ఏకంగా రూ.60 వేల వరకు సంపాదిస్తోంది. ఐటీలో ఆ యువతి మంచి ఉద్యోగమే చేస్తున్నప్పటికీ.. అక్కడ ఉండే విపరీతమైన వర్క్ ప్రెజర్ కారణంగా ఆమె పర్సనల్ లైఫ్ తీవ్రంగా దెబ్బతింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ (పని, వ్యక్తిగత జీవితాల సమతుల్యత) లోపించడం.. రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో ఎంత జీతం వస్తున్నా.. లైఫ్‌లో ప్రశాంతత లేదని భావించిన ఆ యువతి.. ధైర్యం చేసింది. భారీగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకుంది. జాబ్ మానేసిన తర్వాత.. మళ్లీ ఏదో ఒక జాబ్‌లో ఇతరుల వద్ద పని చేయడం ఇష్టం లేని ఆ యువతి.. తానే సొంతంగా ఒక ఆటోను కొనుగోలు చేసి నడపడం ప్రారంభించింది. అయితే ఆమె ఆటో నడపడం ప్రారంభించిన మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎంతో మంది అవమానించినా ఆమె వెనక్కి తగ్గలేదు. నిత్యం ఆటో నడుపుతూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. ఇక ఆ యువతి తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో తెగ వైరల్‌గా మారింది. జాబ్‌ల కోసం ఇళ్లు, ఊరిని వదిలేసి.. నగరాల్లో ఒత్తిడితో కూడిన కార్పొరేట్ జీవితాన్ని గడుపుతున్న ఉద్యోగులను ఆమె స్టోరీ కదిలించింది.