సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఈ సారి తన మాజీ ప్రేయసి గురించి విషయాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. లలిత్ మోదీ - సుస్మితా సేన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు నెట్టింట ఎన్నో రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా సుస్మితా సేన్ డైమండ్ క్వీన్, గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్ చేశారు. వాటన్నింటిని ఖండిస్తూ లలిత్ మోదీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుస్మితా సేన్ - లలిత్ మోదీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు 2022 జూలైలో నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పట్లో తామిద్దరం ప్రేమలో ఉన్నామని లలిత్ మోదీనే ప్రకటించడంతో అందరూ సుస్మితా సేన్‌పై గోల్డ్ డిగ్గర్ అంటూ విమర్శలు చేశారు. అప్పట్లో వచ్చిన విమర్శలను లలిత్ మోదీ ఇప్పుడు ఖండించాడు. సుస్మితా ఎవరి దగ్గర నుంచి ఏదీ స్వీకరించే వ్యక్తి కాదని, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లినప్పుడు తానే ఖర్చు పెట్టేదంటూ హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. "సుస్మితా సేన్ అందమైన మహిళే కాదు.. చాలా సంపన్నురాలు కూడా. ప్రపంచంలో నాకు తెలిసిన వారిలో అత్యధిక వజ్రాలు కలిగిన వ్యక్తి కూడా ఆమె అయ్యుంటుంది అనుకుంటున్నాను. అవన్నీ ఆమె సంపాదించుకున్నవే. ఆమెకు డైమండ్ స్టోర్లు కూడా ఉన్నాయి. మేమిద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు ఒక్కసారి కూడా నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. ప్రతీదానికీ ఆమే ఖర్చు పెడుతుంది. నిజానికి నేనే కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని. ఎవరైనా ఆమెను గోల్డ్ డిగ్గర్ అంటుంటే అది పూర్తిగా అవాస్తవం. నిజానికి నేను ఆమె విషయంలో డైమండ్ డిగ్గర్‌ని ఎందుకంటే ఆమె నిజంగానే ఒక డైమండ్ లాంటి వ్యక్తి. డబ్బు కోసం ఆమె నాతో రిలేషన్‌లో లేదు. ఆమెకు కావాలంటే ప్రపంచంలో ఎవ్వరినైనా ఎంచుకునే స్థోమత ఉంది. ఆర్థికంగా చాలా బలమైన మహిళ.. ఎవరి నుంచి ఏదీ స్వీకరించేది కాదు" అని అసలు నిజాన్ని లలిత్ మోదీ బయటపెట్టాడు. లలిత్ మోదీ 2022లో సుస్మితాను తన బెటర్ హాఫ్‌గా పేర్కొనడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ కేవలం డేటింగ్ మాత్రమే చేస్తున్నామని అప్పట్లో ఆయన స్పష్టం చేశాడు. సుస్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత లలిత్ మోదీ ఇఫ్పుడు లెబనాన్‌కు చెందిన రీమా బౌరీతో రిలేషన్‌లో ఉన్నాడు. 2025 ప్రేమికుల దినోత్సవం రోజున వీరిద్దరి రిలేషన్‌ను బయటపెట్టారు.