ఆంధ్రప్రదేశ్‌‌లో విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తోంది. బంగాళాఖాతం (నైరుతి ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య)లో అల్పపీడనం కేంద్రం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువులకాపరులు ఉరుములతో వర్షం పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.ఇవాళ రాష్ట్రంలో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా జికే వీధి మండలం.. పోలవరం జిల్లా చింతూరు, గంగవరం, కూనవరం, రంపచోడవరం.. కోనసీమ జిల్లా ఆత్రేయపురం.. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, గోకవరం, కోరుకొండ, కొవ్వూరు, రాజమహేంద్రవరం అర్బన్&రూరల్, రాజానగరం, సీతానగరం,తాళ్లపూడి.. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం.. కంచికచర్ల అనంతపురం జిల్లా అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు.రాష్ట్రంలో ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. గురువారం సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. 'మొత్తం 17 జిల్లాల్లోని 126 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కౌతాళంలో 42.9, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8, చిత్తూరు జిల్లా రాయలపేట, కడప జిల్లా జమ్మలమడుగులో 42.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అని తెలిపారు.మరోవైపు శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా మే 20 కల్లా అండమాన్‌ నికోబార్‌ దీవులు, పరిసరాల్లోకి ప్రవేశించాలి. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులతో ఈనెల 15 తేదీకే రుతుపవనాలు ప్రవేశిస్తాయంటున్నారు. కేరళను ముందుగానే తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.