HDFC : దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ () ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గోల్డ్-సిల్వర్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో తీసుకొచ్చిన న్యూ ఫండ్ ఆఫర్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు, విదేశీ మారకం నిల్వలను ఆదా చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలకు సూచించారు. దీంతో బంగారం దిగుమతులపై అనిశ్చితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారత ట్రేడ్ బ్యాలెన్స్‌లో ప్రభావం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కొత్త ఫండ్ ఆఫర్‌ని రద్దు చేసుకుంటున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తెలిపింది.ఈ సబ్‌స్క్రిప్షన్ మే 15, 2026 నుంచే మొదలు కావాల్సి ఉంది. మే 29వ తేదీ వరకు కొనసాగనుందని ప్రకటించారు. ఈ కొత్త పథకాన్ని ప్రధానంగా బంగారం, వెండికి అనుసంధానమై ఉండే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో పెట్టుబడి పెట్టేలా రూపొందించారు. అయితే, కేంద్రం బంగారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున ఈ కొత్త స్కీమ్‌ని రద్దు చేసుకోవాలని ఈ ఏఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ' బంగారం సహా విలువైన లోహాల దిగుమతులు, విదేశీ ఖాతాపై వాటి ప్రభావం గురించి దేశవ్యాప్తంగా జరుగుతున్న విస్తృత చర్చ దృష్ట్యా మేము మా గోల్డ్-సిల్వర్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ NFOను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము' అని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ సీఈఓ నవనీత్ మునోత్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకునే లక్ష్యంతో ఏడాది పాటు బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ దేశ పౌరులకు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఉపసంహరణ జరిగినట్లు అర్థమవుతోంది. డిమాండ్‌ను అరికట్టే చర్యలో భాగంగా ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బంగారానికి లింక్ అయి ఉన్న పెట్టుబడి పథకాలపైన ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఒక తెలివైన వాణిజ్య నిర్ణయమని వాల్యూ రీసర్చ్ ఫౌండర్ ధీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. అయితే, గత ఏడాది కాలంలో చూసుకుంటే బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాలు టాప్- పర్ఫార్మింగ్ అసెట్స్‌గా ఉన్నాయి. రూపాయి విలువలో చూసుకుంటే నిఫ్టీ 50 సూచీ 5 శాతానికి పైగా పడిపోయినప్పటికీ బంగారం గత ఏడాదిలో 61 శాతం, వెండి 172 శాతం మేర పెరిగింది. అలాగే విలువైన ఖనిజాల్లోకి పెట్టుబడిదారులు సైతం భారీగా డబ్బులు కుమ్మరించారు. సిల్వర్ ఈటీఎఫ్స్ పరిధిలోని ఆస్తుల విలువ రూ.15,477 కోట్ల నుచంి రూ.81,944 కోట్లకు చేరుకుంది. ఇక గోల్డ్ ఈటీఎఫ్ అసెట్స్ చూసుకుంటే రూ.61,422 కోట్ల నుంచి రూ.1.78 లక్షల కోట్లకు పెరిగాయి.