తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డీఎ.. తాజా పెంపుతో 60 శాతానికి చేరుకోనుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి వర్తిస్తుందని తెలిపారు. సుమారు 16 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అయితే, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ.1,230 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి టీవీకే ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం విజయ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచిన నేపథ్యంలో.. అదే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది కూడా వర్తింపజేస్తున్నట్లు తమిళనాడు గవర్నర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెరుగుతున్నధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల నుంచి కొంత మేర ఉపశమనం కలిగిస్తుందని వారు సంతోషిస్తున్నారు. డీఏ, బకాయిల చెల్లింపులకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది.ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన మహిళలకు ఆర్థిక సాయం రూ. 2,500లకు పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రూ.1000 పథకానికి అంతరాయం కలగకుండా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మహిళా లబ్ధిదారుల ఖాతాలకు సహాయాన్ని విడుదల చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసిన రూ. 1,000 మొత్తాన్ని మే 15న విడుదల చేసేలా చూసేందుకు సీఎం విజయ్, ఆర్థిక కార్యదర్శి, సచివాలయంలోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ‘‘మదిప్పుమిగు మగళిర్ తిట్టం’ కింద నెలకు అర్హత సహాయ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2500కు పెంచుతామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకం నుంచి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను మినహాయిస్తారు. ఇక, తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై విజయ్ తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే.