రూ.21 వేల ఫుల్ బాటిల్ రూ.8 వేలకే.. టెకీ 'చీప్' బాగోతం.. పాత సీసాలో నకిలీ సరుకు

Wait 5 sec.

ప్రస్తుత కాలంలో వైట్ కాలర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనిషి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. బురిడీ కొట్టించి.. సులువుగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారీ మోసాలకు తెగబడ్డాడు. నింపి విక్రయించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం తన కింద పలువురు వ్యక్తులను పెట్టుకున్నాడు. ఖరీదైన ఖాళీ మద్యం సీసాలను తీసుకువచ్చి.. చీప్ లిక్కర్‌తో నింపి మోసం చేసేవాడు. తక్కువ ధరకే దొరుకుతుందని ఆశపడిన మందుబాబులు.. అతడి వలలో చిక్కేవారు. అయితే ఆ మోసం ఎన్నో రోజులు నిలవలేదు. ఎక్సైజ్ అధికారులకు పట్టుబడటంతో.. ఆ ముఠాను అరెస్ట్ చేసి.. ఆ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శరత్ చంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌ అత్తాపూర్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే అందులో వచ్చే డబ్బు సరిపోకపోవడం, జల్సాలకు అలవాటైన శరత్ చంద్ర.. అడ్డదారులకు అలవాటు పడ్డాడు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించేందుకు ఖరీదైన లిక్కర్ బాటిళ్లలో తక్కువ ధర మద్యాన్ని లిక్కర్ నింపి వాటిని అమ్మి డబ్బులు రాబట్టాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే లిక్కర్ ఈవెంట్లలో పని చేసే ఒడిశాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్‌లతో పరిచయం పెంచుకున్న శరత్ చంద్ర.. వారి ద్వారా వేల రూపాయల ధర పలికే ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకునేవాడు.రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, గ్లెన్ ఫ్లెడ్ విచ్ వంటి ఖరీదైన మద్యం బాటిళ్లను వారిద్దరూ లిక్కర్ ఈవెంట్లలో సేకరించి.. వాటిని కొండాపూర్ గుట్టల బేగంపేటలో అద్దెకు తీసుకున్న గదికి ఆ ముగ్గురు కలిసి తీసుకెళ్లేవారు. తక్కువ ధరలకు దొరికే చీప్ లిక్కర్‌లో నీళ్లను కలిపి ఆ ఖాళీ బాటిళ్లలో నింపేవారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వాటికి మూతలు కూడా పెట్టేవారు. ఆ తర్వాత వాటిని శరత్ చంద్ర తనకు పరిచయం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తక్కువ ధరకే.. ఖరీదైన లిక్కర్ బాటిళ్లు వచ్చాయని చెబుతూ.. విక్రయించేవాడు.ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో రూ.21వేలు ఉండే రాయల్ సెల్యూట్ విస్కీ బాటిల్‌ను కేవలం రూ.8 వేలకే విక్రయించేవారు. అదే సమయంలో రూ.9 వేలు ఉన్న చివాస్ రీగల్ విస్కీని రూ.4 వేలకే అమ్మేవారు. అయితే ఈ చీప్ బాగోతానికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్ఐ అఖిల్ సహా పలువురు సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. లాలు ప్రసాద్ బిస్వాల్, శరత్ చంద్రను అరెస్ట్ చేయగా.. రాజేశ్వర్ మెహర్ పరారీ కావడంతో అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వీరిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.