సమ్మక్క వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయం.. పాములు ప్రత్యక్షం కాగానే మొరాయించిన జేసీబీ

Wait 5 sec.

ములుగు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతుండగా ఊహించని పరిణామం జరిగింది. యూనివర్సిటీకి ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించగా.. ఈ సందర్భంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టి సమయంలో అక్కడ పురాతన ఆలయం ఉన్నట్లు తెలిసింది. పురాతన ఆలయం ఉన్నట్లు శిలలు బయటపడ్డాయి. అదే సమయంలో అక్కడే నాగు పాములు ప్రత్యక్షం కావడంతో.. అక్కడ ఉన్నవారు వణికిపోయారు. అదే సమయంలో జేసీబీ కూడా పనిచేయకపోవడంతో.. వారంతా అక్కడి నుంచి పారిపోవడం గమనార్హం.ప్రహరీ గోడ నిర్మించేందుకు జేసీబీతో కందకాలు తవ్వుతుండగా.. ఆపరేటర్‌కు పురాతన రాళ్లు కనిపించాయి. అయితే అవి మామూలు రాళ్లు అని భావించిన ఆ జేసీబీ ఆపరేటర్ వాటిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అవి మామూలు రాళ్ల లాగా అతడికి అనిపించలేదు. అవి కచ్చితంగా పురాతన కాలంలో ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన శిలలు అని గుర్తించాడు. ఈ క్రమంలోనే ఆ శిలలను జేసీబీతో కదిలించగానే.. వాటిలో నుంచి ఊహించని విధంగా ఒకేసారి 3 నాగుపాములు ప్రత్యక్షం అయ్యాయి. అకస్మాత్తుగా ఆ నాగు పాములు కనిపించడంతో.. అక్కడి వారు భయానికి గురయ్యారు. ఆ పాములు ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికి రావడంతో.. అంతా షాక్ అయ్యారు. అందులో ఒక పాముపై మట్టి, రాళ్లు పడడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో వణికిపోయిన జేసీబీ ఆపరేటర్.. ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. ఇక ఆ పాములు బయటికి వచ్చిన తర్వాత జేసీబీ పనిచేయకుండా మొరాయించడంతో.. వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పారు. ఇక ఆ తవ్వకాల్లో బయటపడిన శిలల ఆకృతిని బట్టి చూస్తే.. అవి కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయానికి ఉపయోగించిన రాళ్లు అయి ఉంటాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో అలర్ట్ అయిన అధికారులు ప్రస్తుతానికి యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. పురాతన ఆలయ సంపదతో పాటు భారీ నాగుపాములు బయటికి రావడంతో ఇప్పుడు ములుగు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.