దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీక్‌ అంశం సంచలనం సృష్టించింది. దాంతో పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్ నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నీట్ రీ ఎగ్జామ్‌ తేదీ ఖరారైంది. జూన్ 21న నిర్వహిస్తాం.. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాం.. ఇప్పటికే సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.. లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు చేపడతాం... విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. వాళ్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. వారి భవిష్యత్తు బాగుండేలా చూడటమే మా మొదటి లక్ష్యం.. మా ప్రధాన కర్తవ్యం పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే.. ఏటా ఎన్టీఏ కోటి మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. అలాంటింది పేపర్ ఎలా లీక్ అయ్యింది.. ఎవరి ద్వారా బయటకు వెళ్లిందనే పూర్తి వివరాలు దర్యాప్తులో బయటకువస్తాయి.ఈసారి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం... రీ ఎగ్జామ్ కోసం తమకు నచ్చిన సెంటర్‌ను విద్యార్థులు ఎంపిక చేసుకోడానికి వారం రోజులు సమయం ఇస్తున్నాం.. జూన్ 14న హాల్ టిక్కెట్లు విడుదల చేస్తాం.. పరీక్ష కోసం మళ్లీ దరఖాస్తు, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం చూసి విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు.. పరీక్ష రద్దు చేయడం కలిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని రీఎగ్జామ్‌లో విద్యార్థులకు అదనంగా 15 నిమిషాల సమయం ఇవ్వనున్నాం’’ అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్పష్టతనిస్తూ, అక్రమాల పట్ల ప్రభుత్వానికి 'జీరో టాలరెన్స్' ఉందని ఆయన అన్నారు. ‘‘పేపర్ లీక్‌కు మూల కారణం ఓఎంఆర్ (OMR) అందువల్ల వచ్చే ఏడాది నుంచి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తాం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.