‘భోజ్‌శాల మసీదు కాంప్లెక్స్ హిందూ ఆలయమే.. ముస్లింలు అక్కడ నమాజ్ చేయొద్దు’: మధ్యప్రదేశ్ హైకోర్టు

Wait 5 sec.

భోజ్‌శాల-కమాల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివాదాస్పద ప్రాంతాన్ని హిందూ ఆలయమేనని న్యాయస్థానం గుర్తించింది. ‘‘ఈ ప్రదేశంలో హిందూ ఆరాధన కొనసాగింపు ఎన్నడూ నిలిచిపోలేదని మేం గమనించాం.. పర్మార్ వంశానికి చెందిన రాజా భోజుడితో సంబంధం ఉన్న సంస్కృత విద్యా కేంద్రంగా ఈ వివాదాస్పద ప్రాంతం భోజ్‌శాల ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నట్టు మా పరిశీలనలో తేలింది’’ అని మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఇండోర్ బెంచ్ పేర్కొంది.భోజ్‌శాలను వాగ్దేవి (సరస్వతీ దేవి)కి అంకితం చేసిన ఆలయంగా హిందువులు పరిగణిస్తుండగా, ముస్లిం వర్గం ఈ కట్టడాన్ని కమల్ మౌలా మసీదుగా గుర్తిస్తోంది. జైన సమాజానికి చెందిన ఒక పిటిషనర్ ఈ సముదాయం మధ్యయుగానికి చెందిన జైన ఆలయం, గురుకులమని వాదించారు. 2003 ఏఎస్ఐ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ASI) ఒప్పందం ప్రకారం భోజ్‌శాలలో హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఆ ప్రాంగణంలో పూజలు చేసుకునే ప్రత్యేక హక్కులు తమకే కావాలని కోరుతూ.. హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇది హిందూ ఆలయమేనని గుర్తించింది.విచారణ సమయంలో భారత పురావస్తు విభాగం సమర్పించిన నివేదిక.. ఇది ఒకప్పుడు హిందూ ఆలయాల సముదాయమని పేర్కొంది. అంతేకాదు, వాటి శిథిలాలతోనే మసీదు నిర్మాణం జరిగిందని తెలిపింది. రెండేళ్ల కిందట ఏఎస్ఐ 98 రోజులపాటు శాస్త్రీయ సర్వే జరిపి, 2 వేల పేజీలకుపైగా నివేదికను సమర్పించింది. మసీదు నిర్మాణం కంటే ముందే ఆ ప్రాంతంలో భారీ ఆలయం ఉన్నట్లు పలు శిల్పాలు, స్తంభాల శిథిలాలు, శాసనాలు తెలియజేస్తున్నాయని వివరించింది. అవి పర్మార్‌ రాజవంశం కాలానికి చెందినవని చెప్పింది.ASI తన శాస్త్రీయ సర్వేలో కనుగొన్న నాణేలు, శిల్పాలు, శాసనాలు ఈ సముదాయం వాస్తవానికి ఒక దేవాలయం అని నిరూపిస్తున్నాయని హిందూ పక్షం వాదిస్తోంది. కానీ, ఆ సర్వే నివేదిక పక్షపాతంతో ఉందని, హిందూ పిటిషనర్ల వాదనలకు మద్దతు ఇచ్చేలా తయారు చేశారని ముస్లిం పక్షం కోర్టులో వాదించింది. కానీ హైకోర్టు మాత్రం అది హిందువులకు చెందిన ప్రాంతమేనని నిర్ధారణకు వచ్చింది. ఇక్కడ హిందువులు పూజలు చేయడానికి అనుమతి ఇచ్చిన న్యాయస్థానం, ముస్లింలు నమాజ్ చేయకూడదని ఆదేశించింది.లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాతా విగ్రహాన్ని వెనక్కి రప్పించే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. మసీదు ఏర్పాటు కోసం ముస్లింలు కోరితే, వారికి ధార్‌లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ కేసులో వాదనలు పూర్తి కాగా.. తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కోర్టు సెలవులు ముగిసిన తర్వాత తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని భోజ్ ఉత్సవ్ సమితి లాయర్ శిరీష్ దూబే అభిప్రాయపడ్డారు.