ఆత్మీయ సమావేశంలో వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత విమర్శలు గుప్పించారు. కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలకు.. పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాపుల కోసం మాత్రమే రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ కళ్యాణ్.. తనకు రెల్లి, మాదిగ, ఇలా అన్ని కులాలు అవసరమేనని అన్నారు. కాపులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలకు ఎదురుదాడితో సమాధానం చెప్పాలని జనసేన నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేనను ఒక్క కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తే తిప్పికొట్టాలని.. జనసేన అందరి కోసం పని చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. "కాపులకు ఏం చేశారని వైసీపీ నేతలు అడుగుతున్నారు. నేను ఒక్క కాపుల కోసం ఆలోచించి రాలేదు. నేను రెల్లి కులస్తుల కోసం వచ్చా. మాదిగ సామాజికవర్గం కోసం వచ్చా. బీసీలు, ఓసీలు అందరూ బాగుండాలని ఆలోచిస్తా. నన్ను ఒక కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తే తిప్పికొట్టండి. ఈ మధ్య ఉన్నట్లుండి కొందరికి ప్రేమలు ఎక్కువయ్యాయి. ఏం చేశారని గొంతులు చించుకుంటున్నారు.. ఇలాంటి మహానుభావులు అందరికీ నేను ఒక్కటే అడుగుతున్నా. ""మాట్లాడితే వంగవీటి రంగా పేరు తెస్తున్నారు.. ఆయన చనిపోయేముందు తనకు ప్రాణహాని ఉందంటే.. మీరెవరూ తపనపడలేదే? ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న వాళ్లంతా.. ఆ రోజు ఏమయ్యారు. ఆయన చుట్టూ పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? ఒంటరిగా వదిలేశారు. మనిషి బతుకున్నప్పుడు రక్షించుకోలేదు కానీ.. చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. నిజంగా నాకు కులమంతా ఓట్లేస్తే నేను రెండు చోట్లా ఓడిపోకూడదు కదా.. భీమవరం, గాజువాకలో ఎలా ఓడిపోయా?" అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.మరోవైపు గ్యాస్, పెట్రోల్ వైసీపీ నేతల ఇంట్లో నుంచి వస్తాయా అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. అరకొర జ్ఞానంతో వైసీపీ నేతలు చెప్పే మాటలను ఎవరూ వినొద్దని సూచించారు. ఇరాన్ - అమెరికా యుద్ధం వల్ల మనకేం సంబంధం అనేలా వైసీపీ అవగాహన ఉందన్న పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీని తిట్టడం కొందరికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. ఇక అమరావతిపైనా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను చూసి ప్రాంతీయ అభిమానం ఎలా ఉండాలో నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్.. జై అమరావతి అనడం మానేసి.. అందరూ జై ఆంధ్రా అనాలని సూచించారు.