మండే ఎండల్లో చల్లటి కబురు.. రేపే అండమాన్‌కు, ఈ నెల 26న కేరళకు రుతుపవనాలు

Wait 5 sec.

మాడుపగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం () చల్లని కబురు మోసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి జీవనాధరమైన ఈ ఏడాది ముందుగానే వస్తున్నాయని తెలిపింది. రుతుపవనాలు మే 26న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. సాధారణంగా జూన్‌ 1 నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయి. కానీ ఈసారి ఐదు రోజుల ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మే 26న వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు రోజులు అటు ఇటుగా మే 22- 30 మధ్య రుతుపవనాలు తాకే అవకాశం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.కేరళను తాకి.. అక్కడి నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని మిగితా ప్రాంతాలకు విస్తరిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలతో వర్షాలు అధికంగా కురుస్తాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరణకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘‘భారత ప్రధాన భూభాగంలో రుతుపవనాల విస్తరణను కేరళలోకి వాటి రాకతో గుర్తిస్తాం. అధిక ఉష్ణోగ్రత, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి జరిగే మార్పులను సూచించే ముఖ్యమైన సూచిక ఇది. రుతుపవనాలు విస్తరిస్తున్న కొద్దీ, ఆయా ప్రాంతాల్లో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుంది’’ అని ఐఎండీ పేర్కొంది.అయితే, ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని అభిప్రాయపడింది. రుతుపవన కాలంలో సాధారణంగా సుమారు 80 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ఏడాది దీర్ఘకాలిక సగటు (1971-2020 మధ్య కాలం) 87 సెం.మీగా ఉంది.దేశ వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే జీవనాడి. నాలుగు నెలల కాలంలో దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం ఇవే అందిస్తాయి. వ్యవసాయం మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, సాగునీటి ప్రాజెక్ట్‌లు, భూగర్భ జలాల పెరుగుదలకు ఇవే కీలకం. మన దేశంలో 50 శాతానికిపైగా సాగుభూమి ఇప్పటికీ వర్షధారమే. దేశం మొత్తం వ్యవసాయోత్పత్తిలో 40 శాతం దిగుబడికి రుతుపవన వర్షాలే కారణం. అందుకే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఈ ఏడాది సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినట్టు ఇన్‌కాయిస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.