‘ఇంటింటి రామాయణం’: రాజేశ్వరి నా కన్నతల్లి కాదా? వినేసిన పల్లవి.. ఇప్పుడుంటదీ అసలు ఆట

Wait 5 sec.

సీరియల్‌‌లో అవని తిప్పల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గత 609 ఎపిసోడ్‌లుగా.. ఆమె తిప్పల్ని, అప్పుల్ని చూస్తూనే ఉన్నాం. తనకో, తన ఫ్యామిలీకో ఒక సమస్య వస్తుంది. దాన్ని పరిష్కరించడం కోసం అవని రంగంలోకి దిగుతుంది. ఒక సమస్య తరువాత మరో సమస్య. అలా ట్రబుల్ షూటింగ్ మాదిరిగా వరుస సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. అయితే చాలా వరకూ అవని విషయంలో లేపి తన్నించుకునే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. తనకి సంబంధం లేని విషయాల్లో వేలుపెట్టడం.. తగదునమ్మా అంటూ ప్రతిదాంట్లోనూ దూరిపోవడంతో తోడికోడళ్లైన పల్లవి, శ్రియలకు అవని అంటే ఒళ్లు మంట. సీరియల్ కాబట్టి నడిచిపోతుంది కానీ.. ఏ పెళ్లమైనా మొగుడు తన మాట కాకుండా.. తోడి కోడలు మాట వెంటే ఊరుకుంటుందా? ఇల్లు పీకి పందిరి వేయదూ. అటు శ్రీకర్ కానీ.. ఇటు కమల్ కానీ.. కట్టుకున్న పెళ్లాల మాట అస్సలు వినరు. ముఖ్యంగా కమల్ అయితే.. పెళ్లాన్ని తిడుతూ వదినను పొగుడుతూ ఉంటాడు. ఇలా చేస్తే ఏ పెళ్లం మాత్రం పగ పెంచుకోదు. పల్లవి పనికిమాలినదే కావచ్చు కానీ.. ఎంతైనా కమల్‌కి భార్య. అందులోనూ.. పెళ్లం ఎంత వెధవ అయినా.. వేరే వాళ్ల ముందు తనని తక్కువ చేస్తేనే ఒప్పుకోదు. అలాంటి ప్రతి విషయంలోనూ అవనిని ఎక్కువ చేస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ కారణంతోనే.. అవని అసహ్యించుకుంటుంది పల్లవి. తన తల్లిదండ్రుల్ని విడగొట్టిన అవనిపై పగ సాధించడానికి పంతం పట్టింది. అవనిని ఆమె కుటుంబాన్ని నాశనం చేయడానికి పథకం పన్నింది. అయితే ఈ సీరియల్‌లో తప్పు చేయడం.. దొరికిపోవడం.. అవని చేతుల్లో చెంపదెబ్బలు తినడం.. మొగుడుతో మెడపట్టి గెంటించేసుకోవడం పల్లవికి చాలా రొటీన్. మరోసారి పల్లవిని మెడపట్టి బయటకు గెంటేశాడు కమల్. అయితే.. పల్లవి లేకపోతే అవనికి నిద్రపట్టదో ఏమో కానీ.. ఆమె అలా వెళ్లిందో లేదో.. పల్లవిని తీసుకొస్తానని రాజేశ్వరి ఇంటికి వెళ్లింది అవని. తాజా ప్రోమో చూస్తే.. అవని వెళ్లి రాజేశ్వరితో మాట్లాడుతుంటే.. తాను రాజేశ్వరి కన్న కూతుర్ని కాదనే నిజాన్ని వినేసింది పల్లవి. ‘మా ఇంటికి ఎందుకొచ్చావ్ అని పల్లవి అంటే.. నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్లడానికి వచ్చాను అని అంటుంది అవని. ‘నా కూతుర్ని తీసుకుని వెళ్లడానికి నువ్వెవరు? అని అంటుంది రాజేశ్వరి. ‘మీరు కాస్త పక్కకి వస్తే చెప్తాను’ అని అంటుంది అవని. ఇక ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లి రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ‘చూడు పిన్నీ.. నేను చెప్పినట్టు వినకపోతే నిజం చెప్పేస్తానని మీకు ఆరోజే చెప్పాను. పల్లవి మీ కన్నకూతురు కాదని చెప్తే.. మీ దగ్గరా ఉండదు.. మా అమ్మని అసహ్యించుకుని మా అమ్మ దగ్గరకు కూడా వెళ్లదు’ అని అంటుంది అవని. అయితే ఆమాటని వినేస్తుంది పల్లవి. ఇప్పటి వరకూ తాను రాజేశ్వరి కన్న కూతుర్నే అనుకుంటుంది పల్లవి. అయితే తాను రాజేశ్వరి కూతుర్ని కాదని.. తాను ద్వేషించే మీనాక్షే తన తల్లి అని పల్లవికి తెలియడంతో ఇప్పుడు అసలు ఆట మొదలైంది.