తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతున్న తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు కావడం వల్ల.. ఇందులోకి ఆరెస్సెస్ శాఖను లాగుతున్నారని.. తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి.. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి భగీరథ్ కేసు విషయంలో ఆర్ఎస్ఎస్‎పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరెస్సెస్ సంఘ్ కార్యకర్తలను, సంఘాన్ని.. కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నాయని.. ఆరెస్సెస్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించడంపై బర్ల సుందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జీ.. ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ జీల పేర్లు కొన్ని మీడియాల్లో రావడం.. కేంద్రమంత్రి బండి సంజయ్‎తో వారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని పేర్కొనడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. అసత్య ప్రచారాలను రూపొందించి.. కొన్ని మీడియా సంస్థలు అవాస్తవ విషయాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆరెస్సెస్ సంఘం తెలిపింది. సమాజంలో నిస్వార్థంగా, ప్రజా సేవలో నిరంతరం నిమగ్నం అయ్యే లబ్ధ ప్రతిష్ఠ కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని.. వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘాన్ని.. సంఘ కార్యకర్తలను అప్రతిష్ఠ పాలు చేయాలని చూస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతర్గత, సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంతవరకు.. తెలంగాణలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఇందులో ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్‎ ఎలాంటి ప్రత్యక్ష జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలు కనీస విచక్షణ లేకుండా.. బండి సంజయ్‎కి సంఘ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయంటూ.. అందుకే ఆయనను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలని ప్రచురిస్తూ.. ఆర్ఎస్ఎస్‌కు ఈ వ్యవహారాన్ని అంటగడుతూ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడటం చాలా దురదృష్టకరమని ఆరోపించింది. సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని మండిపడింది. ఇక నుంచైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపేయాలని.. లేకపోతే అలాంటి వారు చట్టప్రకారం కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది.