CSKకి ఆఖరి అవకాశం.. గుజరాత్‌పై భారీ విక్టరీ సాధిస్తే ప్లే ఆఫ్స్ ఛాన్స్, కానీ ఇలా జరిగితేనే సాధ్యం!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపునకు వచ్చాయి. ఈ వారంలో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే జట్ల ఫైనల్ జాబితా కూడా సిద్ధం కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. ఆఖరి స్థానం కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇవాల్టితో ఆఖరి అవకాశం. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ తలపడనుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లలో ఇరు జట్లకి ఇదే ఆఖరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా పోరాడుతూనే ఉంది. గుజరాత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్కే తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. అయితే, అదే సమయంలో ఇతర జట్ల మీద కూడా ఆధారపడాల్సి ఉంది. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత నుంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి మెల్లిగా పైకి వచ్చి ఐదో స్థానానికి స్థిరపడింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సన్‌రైజర్స్‌పై ఓటమిపాలయింది. దాంతో ఇప్పుడు 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగాలంటే గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే కనీసం 20 పరుగులకు పైగా తేడాతో గెలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా ముంబై ఇండియన్స్‌పై చిత్తుగా ఓడాలి. దాంతో పాటు 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓడిపోవాలి. ఇలాంటి సందర్భంలో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది.