బండి భగీరథ్‌ పోక్సో కేసు.. ప్రతీకారం, ప్రచారం కోసం కాదు.. బాధితురాలి తల్లి లేఖ

Wait 5 sec.

ఫిర్యాదు చేసి, స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధిత బాలిక తల్లి.. తాజాగా సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. చట్టాన్ని గౌరవించి.. నిబంధనల మేరకు మైనర్ బాలిక వివరాలు, గుర్తింపును రహస్యంగా ఉంచుతున్నామని తేల్చి చెప్పారు. తన బిడ్డకు రక్షణ, గౌరవం, భవిష్యత్ ఉండాలని భావించి ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. లేక ఆర్థిక అవసరాల కోసమో, ప్రతీకారం లేదా ప్రచారం కోసమో తాను ఈ ప్రకటన చేయడం లేదని.. తన బిడ్డకు, తన కుటుంబానికి న్యాయం జరగడం కోసమే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆమె వివరించారు.ఈ విషయంలో మౌనంగా ఉండటం కంటే నిజం చెప్పడమే అవసరమని భావించి.. ఈ విషయాలు వెల్లడిస్తున్నానని బాధితురాలి తల్లి చెప్పారు. ఇది ముఖ్యమని వెల్లడించారు. తన కుమార్తెకు 2025లో బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పినట్లు తెలిపారు. అయితే తమ కుమార్తెకు చదువుపై ఆసక్తి తగ్గేలా చేసి.. ఆమెతో శారీరక సంబంధం కోసం తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారంటూ బండి భగీరథ్‌పై బాధితురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి ఆ మరుసటి రోజు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున వరకు మొయినాబాద్‌లో జరిగిన సంఘటనలను ఆమె వివరించారు.తన కుమార్తెను మద్యం సేవించమని ఒత్తిడి చేసి.. ఆమె బలహీన స్థితిలో ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో తమ కుమార్తె తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. చాలా రోజులు అవమానంగా.. మానసిక వేదనను అనుభవించిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని.. నిజానిజాలు తప్పకుండా బయటికి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు.మరోవైపు.. చాటింగ్‌లో బండి భగీరథ్ క్షమాపణలు చెప్పడం.. ఎమోషనల్‌గా తన కుమార్తెపై ఒత్తిడి తీసుకురావడం వంటివి చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. డిజిటల్ ఆధారాలను భద్రపరచి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని ఆమె పోలీసులను కోరారు. ఈ ఏడాది జనవరిలో బ్రేకప్ చెప్పిన తర్వాత తమ కుమార్తె మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఎప్పుడూ ఆనందంగా ఉండే తమ కుమార్తె.. ఒక్కసారిగా మౌనంగా ఉండి.. మానసికంగా కుంగుబాటుకు గురైందని తెలిపారు. అప్పుడు కూడా బండి భగీరథ్ నుంచి తమకు పలుమార్లు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తాము ప్రయత్నించామని.. అయితే పరోక్షంగా ఒత్తిళ్లు, రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు జరిగాయని.. కేసు పెట్టొద్దంటూ కోరారని బాధితురాలి తల్లి వెల్లడించారు. ఏప్రిల్ 21వ తేదీన తమ కుటుంబంపై బ్లాక్‌మెయిల్‌, డబ్బుల కోసం వేధించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదులు నమోదు కావడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. బాధితురాలకు న్యాయం చేయాల్సింది పోయి.. తమపైనే ఫిర్యాదులు పెట్టి, తమను నిందితులు చేసే ప్రయత్నం జరిగిందని వాపోయారు.ఏప్రిల్ 22వ తేదీన బీజేపీకి చెందిన ఒక వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడాడని.. ఆ తర్వాతి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని తాము కలిసినట్లు చెప్పారు. భరోసా కోసం వెళ్లిన తమను వారు భయపెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి తాము భయం, మానసిక ఒత్తిడితో జీవిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈనెల 8వ తేదీన పేట్‌ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. మైనర్ బాలిక కేసు అయినప్పటికీ 5 గంటలకుపైగా తాము పోలీస్ స్టేషన్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చిందని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని తాము కోరిన తర్వాత పోలీసులు తమ ఫిర్యాదును తీసుకున్నట్లు చెప్పారు. అప్పుడు తమ కుమార్తె మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. మైనర్ బాలిక ఇచ్చిన వాంగ్మూలం తర్వాత నాన్‌ బెయిలబుల్ సెక్షన్లను చేర్చినట్లు వెల్లడించారు. ఇక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో కేసు దర్యాప్తులో వేగం పెరిగినట్లు తెలిపారు.ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఈ కేసు నుంచి దృష్టి మళ్లించేందుకు తమ కుమార్తె బర్త్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటికి రాకముందే డేట్ ఆఫ్ బర్త్ రికార్డులను సవరించారని ఆమె తెలిపారు. పోక్సో కేసులో చట్టం ప్రకారం బాలికకు అందే రక్షణను ఎవరూ తొలగించలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి బాధితురాలి తల్లి కీలక విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు, మానసిక ఒత్తిళ్లు, సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేయడం నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు, మహిళా కమిషన్లు, బాలల హక్కుల సంస్థలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కేసులో ప్రతీ ఆధారాన్ని చట్ట ప్రకారం భద్రపరిచి.. దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలి గుర్తింపును బయట పెట్టవద్దని ఈ సందర్భంగా మీడియా, సోషల్ మీడియాను కోరారు. ఇలా చేయడం వల్ల తమ కుమార్తె అనుభవిస్తున్న మానసిక వేదన మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, చట్టాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. చివరికి నిజం, న్యాయం గెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.