: స్థిరమైన శాలరీ లేదా మానసిక ప్రశాంతతలో ఏది కావాలి? అని ప్రస్తుతం భారతీయ ఐటీ రంగంలోని యంగ్ ప్రొఫషనల్స్ తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. లక్షల జీతాల ప్యాకేజీలు, ప్రమోషన్ల వెనుక తాము ఒత్తిడి, నిస్సత్తువ, నిరంతర ఆందోళనను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఈ టాక్సిక్ ఐటీ ఉద్యోగ వాతవారణం నుంచి ఓ టెక్ ఎంప్లాయీ బయటపడాలనుకున్నారు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. కానీ, అతను అనుకున్నట్లుగా జరగలేదు. జీవితం తలకిందులైంది. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ సోషల్ మీడియా రెడ్డిట్‌లో పంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం కేవలం కొన్ని నెలల్లోనే తమను ఆర్థిక ఇబ్బందుల్లోకి ఎలా నెట్టివేసిందని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.డెవ్‌ఆప్స్ ఇంజనీర్‌గా పరిచయం చేసుకున్న ఆ రెడ్డిట్ యూజర్ తనకు మూడేళ్ల అనుభవం ఉన్నట్లు చెప్పారు. అయితే మానసికంగా అలసిపోవడం వల్ల 2026 ఫిబ్రవరిలో తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో, ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలివేయడం వల్ల తాము తిరిగి సమతుల్యతను పొంది చివరికి ఒక మంచి అవకాశాన్ని సంపాదించుకోగలమని భావించినట్లు తెలిపారు. కానీ, ఆ నిర్ణయం త్వరలోనే ఒక కఠినమైన వాస్తవ పరిస్థితిగా మారిపోయింది. నెలలు గడుస్తున్నా తాను ఇంకా నిరుద్యోగిగానే ఉన్నానని, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, మల్టిపుల్ రౌండ్స్ క్లియర్ చేసినా ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలకు పిలుస్తున్నా ఆ తర్వాత కంపెనీల నుంచి స్పందన ఉండడం లేదని, ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని వాపోయారు. 'కొన్ని చాలా బాగా పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ స్పందన లేదు. రిజెక్షన్ మెయిల్ లేదు, కాల్ లేదు, ఏదీ లేదు.' అంటూ పేర్కొన్నారు. ఆ టెక్కీ కెరీర్‌పైనే దెబ్బపడిందని చెప్పవచ్చు. అతడి రోజువారీ జీవనంపైనా ప్రభావం చూపించింది. తాను అనుకున్న దానికంటే వేగంగా తన సేవింగ్స్ మొత్తం అయిపోయాయని, దీంతో తాను తన కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చినట్లు తెలిపారు. 'నా సేవింగ్స్ అయిపోయాయి. పీఎఫ్ డబ్బులూ అయిపోయాయి. ఫ్యామిలీ సపోర్ట్‌తో సర్వైవ్ అవుతున్నా. ఒకప్పుడు ఆలోచించకుండా డీమార్ట్ వంటి వాటిల్లో షాపింగ్ చేశాను. ఇప్పుడు ప్రభుత్వ రేషన్ దుకాణాల వద్ద నిలబడుతున్నాను. నా ఇంటి ముందు కారు ఉంది కానీ అందులో పెట్రోల్ పోసేందుకు డబ్బులు లేవు' అని తెలిపారు. టెక్నాలజీ రంగంలో మరో రోల్ పొందడం అనేది అసాధ్యంగా మారిపోయందని దేవ్ ఆప్స్ ఇంజినీర్ పేర్కొన్నారు. తన కుటుంబం కోసం ఐటీ ఇండస్ట్రీ వెలుపల వర్క్ తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తోందని చెప్పారు. ఐటీ జాబ్ వదిలేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు తాను ఓ నిర్మాణ సంస్థలో నెలకు రూ.25 వేలకు సూపర్ వైజర్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతోనే కుటుంబానికి ఆసరగా ఉంటూ నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. ఐటీలో పని చేసిన తర్వాత జీవితం ఇలా మారిపోతుందని అనుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాలు పెంచుకోవాలని, ప్రయత్నిస్తూనే ఉండాలని, మార్కెట్ రికవరీ అవుతుందని చాలా మంది చెబుతున్నా రోజులు కడిసే కొద్ది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని వాపోయారు.