'ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు'.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల స్ట్రాంగ్ రిప్లై

Wait 5 sec.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో కొన్నిసార్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడికక్కడే పెండింగ్ చలాన్లను మొత్తం కట్టాలని ఆదేశించడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాహనాలను అడ్డుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనాలను సీజ్ చేయవద్దని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశాల నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ.. తన తాత, నానమ్మలను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఓ ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నాడు. పెండింగ్ చలాన్లు కట్టేవరకు అక్కడి నుంచి వెళ్లనీయకపోవడంతో.. ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్ టైమ్ అయిపోయిందని ఆ ఎన్ఆర్ఐ.. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలిపై గౌషిక్ మండవ (Gaushik Mandava) అనే వ్యక్తి ఎక్స్‌లో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపిన గౌషిక్ మండవ.. వృద్ధులైన తాత, నానమ్మలను మెడికల్ చెకప్‌ కోసం తీసుకెళ్తున్న సమయంలో తిరుమలగిరి వద్ద ట్రాఫిక్ పోలీసులు తనను ఆపి చలానా చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు.అయితే తన ఫోన్‌లో గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌లు లేవని.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లిస్తానని చెప్పినా వారు వినిపించుకోలేదని ఆ ట్వీట్‌లో గౌషిక్ మండవ తెలిపారు. దీంతో తాను మరో వ్యక్తికి ఫోన్ చేసి ట్రాఫిక్ చలాన్ కట్టినట్లు తెలిపారు. అయితే చలానా చెల్లించిన తర్వాత కూడా పోలీసుల సిస్టమ్‌లో అప్‌డేట్ కాలేదని.. తాను చెల్లించిన స్క్రీన్‌షాట్ చూపించినా ఆఫీసర్ రాము నాయక్ నమ్మలేదని ఆరోపించారు. దీంతో అక్కడే చాలాసేపు ఆలస్యం కావడంతో హాస్పిటల్‌లో మెడికల్ అపాయింట్‌మెంట్ కూడా మిస్ అయిందని వాపోయారు.ట్రాఫిక్ పోలీసులు వృద్ధులు ఉన్నప్పుడైనా, మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో అయినా కాస్త మినహాయింపు ఇచ్చేలా వ్యవహారించాలని గౌషిక్ మండవ విజ్ఞప్తి చేశారు. తనకు ఎదురైన అనుభవం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆ ట్వీట్‌లో తెలిపారు. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీ సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారి ఎక్స్ అకౌంట్లను ఈ ట్వీట్‌కు అటాచ్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఫోటోను కూడా ఆ ట్వీట్‌కు జత చేశారు.అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు.. ఆ ట్వీట్ కిందే రిప్లై ఇచ్చారు. సాధారణ ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగానే ఆ వాహనాన్ని ఆపామని.. అయితే ఆ వాహనానికి అనధికారిక సైరన్‌ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అది ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉల్లంఘన అని.. అందుకే చట్ట ప్రకారంగా చలాన్ జారీ చేసినట్లు వెల్లడించారు. చట్టానికి అనుగుణంగానే ట్రాఫిక్ సిబ్బంది తమ విధిని నిర్వర్తించినట్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనను కప్పిపుచ్చడం చట్టం ప్రకారం తప్పు అని తెలిపారు. అంతేకాకుండా ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసుల ఎలాంటి దుష్ప్రవర్తన లేదని తేల్చి చెప్పారు. పోలీసు సిబ్బందిపై తప్పుదారి పట్టించే ఆరోపణలను పోస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు.